ఓ వ్యక్తి తన కారును విక్రయిస్తానంటూ ఓఎల్ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు ఆ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. అందులో ఓ వ్యక్తి కారును చూసి బాగుందని చెప్పాడు. అనంతరం టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ 'కీ' తీసుకుని, కారుతో పరారయ్యాడు. టెస్ట్ డ్రైవ్ కోసం అని వెళ్లిన వ్యక్తి ఎంత సేపటికీ రాకపోవడంతో ఆ కారు ఓనర్‌కు చివరికి వాస్తవం బోధ పడింది. తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరు నగరంలోని కాఫీ బోర్డు లే అవుట్ ప్రాంతానికి చెందిన రవీంద్ర ఎల్లూరి అనే వ్యక్తి తన మారుతి విటారా బ్రెజ్జా కారును ఓఎల్ఎక్స్‌లో కొన్నాళ్ల క్రితం అమ్మకానికి పెట్టాడు. ఆ కారును కొనేందుకు చక్కబళ్లాపుర ప్రాంతానికి చెందిన ఎంజీ వెంకటేశ్ నాయక్ ఆసక్తి కనబర్చాడు. కారును బాగా మెయింటైన్ చేశారని కారు ఓనర్‌ను ప్రశంసించాడు. ఓ సారి కారు నడిపి చూస్తానని 'కీ' అడిగి తీసుకున్నాడు. ఆ వెంటనే కారులో కూర్చుని ఓనర్ చూస్తుండగానే ఉడాయించాడు. ఎంతసేపైనా రాకపోవడంతో పోలీసు స్టేషన్‌లో కేస్ పెట్టాడు. వెంకటేశ్ నాయక్ ఉపయోగించిన ఫోన్ అతడిది కాదని, అది దొంగిలించిన ఫోన్ అని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఓఎల్ఎక్స్ ప్రతినిధుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.
2500ల మంది వివరాలను వడపోయగా చివరికి వెంకటేశ్ నాయక్ నిందితుడుగా తేలింది. అతడి భార్య ఊర్లో సర్పంచిగా పోటీ చేయడంతో బాగా ఖర్చుపెట్టాడు. ఓడిపోవడంతో అప్పులు తీర్చడానికి కారు అమ్మేశాడు. కారు లేకుండా ఊరిలో తిరగడం అవమానంగా భావించానని, అందుకే ఓఎల్ఎక్స్‌లో తన కారులాగే ఉన్న కారు ఫొటో చూశానని చెప్పాడు. ఆ తర్వాత దానిని దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, ఆదివారం అరెస్టు చేశారు.