వేసవి కాలంలో పుచ్చకాయలు విరివిగా లభిస్తుంటాయి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎంతో ఇష్టంగా తింటుంటారు. వేసవిలో దాహార్తిని తీర్చడంలో పుచ్చకాయలు ఎంతో దోహదపడతాయి. ఇందులో 92 శాతం వరకు నీరు ఉండడంతో వీటిని తినగానే దాహం సమస్య తీరుతుంది. మిగిలిన 8 శాతంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, బి 1, బి 6, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి, అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. పుచ్చకాయను తరచూ తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. రక్తపోటు అదుపులో ఉంచడంతో పాటు గుండె వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. కేన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నట్లు పలు అధ్యయనాలలో తేలింది.
పుచ్చకాయలో తగు మోతాదులో ఉండే విటమిన్-సి జుట్టు సంరక్షణకు సాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-ఏ కంటి సంరక్షణకు సాయపడుతుంది. కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. గర్భిణులు పుచ్చకాయలు తింటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. దీనిలో లభించే కాల్షియంతో కీళ్ల వ్యాధులు దరి చేరవు. కిడ్నీలో రాళ్లున్న వారు కూడా పుచ్చకాయను అధికంగా తీసుకోవాలి. ఫలితంగా రాళ్లను కరిగించే శక్తి దీనికి ఉంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు పుచ్చకాయ ద్వారా లభిస్తున్నాయి.