నాలుగేళ్లుగా కురుపాం ప్రజానీకం 'గజ'గజలాడుతున్నారు. కంటి మీద కునుకులేకుండా బతుకుతున్నారు. ఇక మూగజీవాల గురించే చెప్పనే అక్కర్లేదు. ఇప్పటి వరకూ మృతి చెందిన వాటి సంఖ్య భారీగానే ఉంది. దీనంతటికీ అసలు కారణం గజరాజుల గుంపే. వాటి ఆగడాలకు హద్దేలేకుండా పోయింది. ఇప్పటి వరకూ వేల ఎకరాల్లో పంట నాశనం కాగా, ఏడుగురు వ్యక్తులు మరణించారు. సమస్య గురించి ప్రభుత్వానికి విన్నవిస్తే తూతూమంత్రంగా పరిహారం ఇచ్చారే తప్ప. పరిష్కార మార్గం మాత్రం చుపాట్లేదు.
దశాబ్దాలుగా ఒడిశా అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఏనుగుల గుంపు కొద్దిరోజులు ఇక్కడ ఉండి, తిరిగి వెళ్లడం అలవాటుగా మారింది. వచ్చిన రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే సంచరించేవి. 2018లో ఒడిశా లభేరి అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపు, నాలుగేళ్లలో ఏడుగురిని హతమార్చాయి. అందులో ఓ అటవీ శాఖ ఉద్యోగి కూడా ఉన్నారు. ఇక మేకలు, ఆవులు, ఆవుదూడల సంగతి చెప్పనక్కర్లేదు వాటి సంఖ్య పదుల్లో ఉంటుంది. మరోవైపు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో చెరకు, అరటి, వరి, జొన్న, టమాటాలాంటి కూరగాయల పంట లను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ సిబ్బందికి నాలుగేళ్లుగా వీటి పర్యవేక్షణే ప్రధాన విధులయ్యాయి. ఎండ, వాన, చలి, రాంత్రిబవళ్లూ పనిచేస్తున్నా వీటిని తిరిగి ఒడిశా ప్రాంతానికి తరలించడం వీలుకావడం లేదు. నాగావళి నదీ పరీవాహక ప్రాంతంలో నీరు, ఆహారం, వివిధ రకాల పంటలు పుష్కలంగా ఉన్నా, ఈ ప్రాంతం వీటి వెళ్లేందుకు ఏనుగుల గుంపు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే మూడు ఏనుగులు మృతి చెందగా, ఓ పిల్ల ఏనుగుకీ జన్మనిచ్చాయి.
ప్రస్తుతం ఐదు పెద్ద ఏనుగులు, ఓ పిల్ల ఏనుగు కలిసి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మ వలస, కొమరాడ మండలాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాలుగేళ్లుగా వీటితో ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వానికి తెలిపినా, తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోవడమేకానీ, పరిష్కారం మాత్రం చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనికి విసిగిపో యిన వారు తక్షణమే ప్రభుత్వం 'ఎలిఫెంట్ జోన్' అయినా పెట్టాలని, లేదంటే శాశ్వతంగా తరలించే మార్గమైనా చూడాలని కోరుతున్నారు. ఇలాగే గతంలో ఏనుగుల గుంపు ఉండిపోతే, వాటికి మత్తు మందు ఇచ్చి భారీ లారీల్లో లభేరీ అటవీ ప్రాంతానికి తరలించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 2018లో సాలూరు ప్రాంతంలో జండికొండ సమీపంలో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం, అటవీ శాఖ యోచన చేసినప్పటికీ ఏనుగులకు సరిపడే నీటి వసతి, ఆహారం లభించదేమోనన్న సందిగ్ధంలో చర్యలు నిలిపివేశారు.