గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతవుతున్నారు. అయితే తాజాగా రాజధాని ప్రాంత వాసులకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే కొద్ది రోజులలో ఢిల్లీలో పగటిపూట ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత కొద్దిరోజులుగా ఎండలతో సతమతవుతున్నవారికి ఉపశమనం కలిగించనుంది. ఇక, ఆదివారం ఢిల్లీ నిప్పుల కుండను తలపించింది. ఢిల్లీలోని Najafgarh, Mungeshpur ప్రాంతాల్లో 49 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్‌లో 46 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే సోమవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం కూడా పాక్షికంగా మేఘావృతమై కనిపించింది.
ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు మంగళవారం నుంచి కనీసం నాలుగు రోజుల పాటు వేడిగాలుల నుంచి ఉపశమనం పొందుతాయని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి సోమవారం తెలిపారు. మే 17 నుంచి వచ్చే నాలుగు రోజుల వరకు ఏ ప్రాంతంలోనూ వేడిగాలులు ఉండవని చెప్పారు.
మరోవైపు తుఫాను ప్రసరణ కారణంగా పంజాబ్, హర్యానాలలో రుతుపవనాల రాక కంటే ముందే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడి ప్రజలు మే 16, 17 తేదీల్లో వేడి నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు పశ్చిమ వాయువ్య, మధ్య భారత్‌పై ఉష్ణగాలుల ప్రభావంగా క్రమంగా తగ్గుముఖం పట్టిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాజస్తాన్ ప్రజలకు ఊరట కలిగించే అంశం కానుంది.
ఇక, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాయని తెలిపింది. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులతో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నట్టుగా పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, వాటి పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నైరుతి గాలులు బలపడటం వల్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ‘‘రానున్న 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి’’ అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక, సోమవారం నుంచి బుధవారం వరకు తమిళనాడులో, మరో రెండు రోజుల్లో లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, దక్షిణ కర్ణాటక తీరంలో 4-5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.