హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రహరీ గోడపై హిందూ దేవుళ్లు శృంగార్ గౌరి, పిళ్లైయార్, హనుమాన్, నంది విగ్రహాలు ఉన్నాయని, దానిని రోజూ పూజించేందుకు అనుమతించాలని కొందరు వారణాసి సివిల్ కోర్టులో కేసు వేశారు. ప్రహరీ గోడపై ఉన్న హిందూ విగ్రహాలను ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపిన కోర్టు జ్ఞానవాపి మసీదును సర్వే చేయాలని ఆదేశించింది. మసీదులో అధికారులు చేపట్టే సర్వేను ముస్లిములు అడ్డుకున్నారు. దీంతో కోర్టు ఆదేశం మేరకు శనివారం జ్ఞానవాపి మసీదులో వీడియోతో సర్వే పనులు ప్రారంభమయ్యాయి. ఈ పని సోమవారంతో పూర్తయింది. నివేదికను న్యాయస్థానానికి మంగళవారం సమర్పించనున్నారు.
దీనిపై పిటిషనర్ సోహన్ లాల్ ఆర్య స్పందిస్తూ జ్ఞానవాపి మసీదులో సర్వే పనుల్లో శివలింగం లభించిందని తెలిపారు. దీంతో తీవ్ర కలకలం రేగింది. సర్వే పనులు పూర్తయిన నేపథ్యంలో శివలింగం ఉన్న ప్రాంతాన్ని సీల్ చేయాలని, ఆ ప్రాంతంలోకి ప్రజలు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ శర్మను వారణాసి కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. నిజం ఎంత దాచినా ఏదో ఒకరోజు వెలుగులోకి వస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా జ్ఞానవాపి మసీదులో శివలింగం కోసం సర్వే చేపట్టడంపై ముస్లిములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో జ్ఞానవాపి మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా జ్ఞానవాపి మసీదులోని బావిలో 12 అడుగుల శివలింగం ఉందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అయితే ఉద్రిక్తతలు తలెత్తకుండా వారణాసిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.