ఐపీఎల్-2022లో లీగ్ మ్యాచ్‌లు ముగుస్తున్నాయి. ప్లే ఆఫ్ బెర్త్ కోసం పలు జట్ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో పలు జట్లపై అంచనాలు తారుమారవుతున్నాయి. ఈ తరుణంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య బుధవారం సాయంత్రం రసవత్తర పోరు జరగనుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టు ఈ సీజన్‌లో కొత్తగా ప్రవేశించినా, మెరుగైన ప్రదర్శన చేసింది. ఆ జట్టు ఆడిన 13 మ్యాచుల్లో 8 విజయాలు, 5 ఓటములతో 16 పాయింట్లు సాధించి, టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరడం దాదాపు ఖాయమనే చెప్పొచ్చు.
మరో వైపు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రదర్శన పడుతూ లేస్తూ వస్తోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడి, 6 విజయాలు, 7 ఓటములతో 12 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, లక్నో జట్లకు ప్లేఆఫ్ ఖాయమనే చెప్పాలి. ఈ తరుణంలో నాలుగో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. దానిని దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కోల్‌కతాకు గెలుపు తప్పనిసరి. ఈ కఠిన పరిస్థితుల్లో నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా లక్నోను ఓడించాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది.