ఈ రోజుల్లో ఏ అబ్బాయికైనా తమ కుమార్తెను ఇవ్వాలంటే తల్లిదండ్రులు పలు విషయాలను ఆలోచిస్తుంటారు. ఆస్తి, ఉద్యోగం, గుణగణాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. వీటిపై ఒకటికి రెండు సార్లు ఆలోచించి, ముందడగు వేస్తారు. అయితే ఇవన్నీ ఉన్నా ఓ ఊరి యువకులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తమ ఊరు పేరు ఎత్తితే, అమ్మాయిల తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారని వాపోతున్నారు. తమకు పెళ్లి జరిగేదెలా అంటూ చింతిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఖూస్రా అనే గ్రామం ఉంది. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇష్టపడరు. ఖూస్రా గ్రామ ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాగు నీరు కోసం కిలోమీటర్ల మేర దూరం నడవాల్సి ఉంటుంది. ఊరిలో ఏ ఇంటికీ కుళాయి కనెక్షన్ లేదు. నీటి కోసం బోర్లు వేసినా, భూమిలో నుంచి నీళ్లు రావడం లేదు. ఊరికి చాలా దూరంలో, అటవీ ప్రాంతంలో చిన్న నీటి కాలువ ఉంది. అందులో నీటినే తాగడానికి గ్రామ ప్రజలు ఉపయోగించుకుంటారు. గ్రామంలో అందరూ అక్కడి వెళ్లి నీటిని తెచ్చుకుంటుంటారు. దీంతో తమ పిల్లను ఆ ఊరికి ఇస్తే, వారు కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తుందని చుట్టు పక్కల ఊళ్ల వారికి తెలుసు. అందుకే ఖూస్రా గ్రామ అబ్బాయిలకు వారు పిల్లని ఇవ్వడం లేదు. సమస్య పరిష్కారం కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతున్నామని ఖూస్రా గ్రామ సర్పంచ్ నేన్‌సింగ్ ఠాకూర్ చెప్పారు.