ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన వైద్య సదుపాయాలు ఉన్న దేశాల్లో ఒకటైన ఉత్తర కొరియాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 1.48 మిలియన్ల మంది జ్వరం, ఇతర అనారోగ్యాల బారిన పడ్డారని 56 మంది చనిపోయారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత మంగళవారం ఒక్కరోజే జ్వరం లక్షణాలున్న 269,510 కేసులను గుర్తించగా.. ఆరుగురు చనిపోయారు. బయటపడుతున్న కేసుల కంటే.. వెలుగు చూడని కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వీరిలో చాలా మంది కరోనా బాధితులని విదేశీ నిపుణులు భావిస్తున్నారు. కొరియాలో ఇప్పటికీ ఆరున్నర లక్షల మందికిపైగా క్వారంటైన్‌లో ఉన్నారు.
ఉత్తర కొరియాలో నమోదవుతున్న జ్వరం కేసుల్లో ఎన్ని కోవిడ్-19 అనే విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక మీడియా పేర్కొనలేదు. తమ దేశ వైద్యులు ఔషధ పంపిణీని పెంచారని మాత్రమే అధికారిక మీడియా తెలిపింది. గత వారం ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసును గుర్తించగానే కిమ్ జాంగ్ ఉన్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. మెడికల్ షాపులను తెరిచి ఉంచడంలో విఫలమైన వైద్యాధికారులపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిలటరీ వైద్య విభాగాన్ని సైతం ఆయన రంగంలోకి దింపారు. రాజధాని ప్యాంగాంగ్ సహా మిగతా ప్రాంతాల్లో అన్ని ఫార్మసీల నుంచి 24 గంటలపాటు ఔషధాలను అందించడం కోసం ఆర్మీని అత్యవసరంగా రంగంలోకి దింపినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడించింది.
సోమవారం సాయంత్రానికి ఉత్తర కొరియాలో దాదాపు 15 లక్షల జ్వరం కేసులు నమోదయ్యాయి. 6,63,910 మంది చికిత్స పొందుతున్నారని.. 56 మంది మరణించారని కేసీఎన్‌ఏ పేర్కొంది. మీడియా ద్వారా ప్రచారాన్ని తీవ్రతరం చేయడంతోపాటు ఫార్మా కంపెనీలు ఔషధాల ఉత్పత్తిని పెంచాయని కేసీఎన్‌ఏ తెలిపింది.
ఉత్తర కొరియాలో కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొరియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. కట్టడికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉంటేఉత్తర కొరియాకు పొరుగున ఉన్న దక్షిణ కొరియా వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, మాస్కులు, టెస్టు కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. కానీ ఈ విషయంలో ప్యాంగాంగ్ మాత్రం స్పందించలేదు. అమెరికా సైతం ఉత్తర కొరియా పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఉత్తర కొరియాలో నమోదు అవుతున్నవి కరోనా కేసులే అయితే మాత్రం.. కిమ్ ఇంతకు ముందు చెప్పినట్లు ఆ దేశం చరిత్రలోనే అతిపెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది.