విద్యుత్ కోతల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఊరట లభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కష్టాలు తొలగిపోయాయి. ఇకపై నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. రాష్ట్రంలో వేసవి ప్రారంభంలోనే విద్యుత్ కోతలతో జనాలు ఇబ్బందిపడ్డారు. బొగ్గు కొరతతో పాటూ బహిరంగ మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు సాధ్యం కాకపోవడంతో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం పవర్ హాలిడే నిర్ణయం తీసుకుంది. గత నెల 8 నుంచి 22 వరకు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొద్దిరోజులు కొనసాగించారు.. ఇప్పుడు బొగ్గు అందుబాటులోకి రావడంతో పవర్ హాలిడేను ఎత్తేశారు. అంతేకాదు రాబోయే వర్షాకాలం కాబట్టి విద్యుత్ కోతలు ఉండవని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి కరెంట్ కోతల నుంచి ఏపీ ప్రజలకు విముక్తి లభించింది.
ఈ మేరకు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే (మే 9 నుంచి) పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరించగా.. ఈ నెల 16 నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీలో సమస్యలు తలెత్తాయని గుర్తు చేసింది. కానీ, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బొగ్గు నిల్వలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.