ఉత్తర కొరియా లో నెలకొన్న కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండున్నరేళ్లుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోయినప్పటికీ తమ దేశంలో ఒక్క కేసు కూడా లేదంటూ ఉత్తర కొరియా ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది. టీకా సాయానికి పలు దేశాలు ముందుకొచ్చినప్పటికీ అవసరం లేదంటూ తిరస్కరించింది. కానీ, ప్రస్తుతం అక్కడ వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. తమ దేశంలో తొలి కరోనా కేసు నమోదయినట్టు ప్రకటించగా.. ఆ మర్నాడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. శుక్రవారం ఏకంగా 21 మంది చనిపోయినట్టు తాజాగా ప్రకటించింది.
మరో 174,440 మంది జ్వర లక్షణాలు ఉన్నాయని తెలిపింది. దీంతో రెండు రోజుల్లోనే అక్కడ 27 కరోనా మరణాలు, 524,440 కేసులు వెలుగుచూశాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి జనం అనారోగ్యం బారినపడుతున్నారు. ఇప్పటి వరకూ 243,630 మంది కోలుకోగా.. మరో 280,810 మంది క్వారంటైన్‌లో ఉన్నారని ఉత్తర కొరియ అధికారులు ప్రకటించారు. కానీ, అధికారిక మీడియా మాత్రం జ్వరం కేసులు, కోవిడ్ మరణాలపై స్పష్టత ఇవ్వడం లేదు.
వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం, పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండడం, అంతంతమాత్రంగా ఆరోగ్య వ్యవస్థ, పేదరికం వంటి సమస్యలు ఎదుర్కొంటోన్న ఉత్తర కొరియాలో వైరస్ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే పరిస్థితి దయనీయంగా మారుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇతర దేశాల సహకారం లేకుంటే భారీ స్థాయిలో వైరస్ వ్యాప్తి, మరణాల ముప్పు తప్పదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్యాంగ్యాంగ్‌లోని కొందరిలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసినట్లు ఉత్తర కొరియా ఇటీవల తెలిపింది. అయితే, ఎంతమందికి నిర్ధారణ అయ్యిందన్న విషయాన్ని వెల్లడించలేదు. కరోనా పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన ఉత్తర కొరియా.. దేశవ్యాప్తంగా ‘అత్యంత అత్యవసర పరిస్థితి’ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ, పొరుగు దేశం చైనా నుంచే ఒమిక్రాన్ తమ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో కేవలం 64,200 కొవిడ్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు.