ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా హేళన చేస్తే..లైంగిక వేధింపుగానే భావించాలి: బ్రిటన్ ట్రిబ్యునల్ తీర్పు

international |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 11:37 PM

పనిచేసే చోట ఏ వ్యక్తినైనా ‘బట్టతల’ పేరుతో పిలిస్తే లైంగిక వేధింపుగానే భావించాలని బ్రిటన్‌కు చెందిన ఓ ట్రైబ్యునల్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు, ఇది ఉద్దేశపూర్వకంగా మహిళల వక్షోజాలను తాకడంతో సమానమైన లైంగిక వేధింపుగా వ్యాఖ్యానించింది. ఓ సంస్థలో 24 ఏళ్లు ఉద్యోగం చేసిన వ్యక్తిని.. గతేడాది ఎటువంటి కారణం లేకుండా తొలగించారు. ఉద్యోగి పై అధికారి బట్టతల అంటూ పిలిచి అవమానించడంతో బాధితుడు తన గోడును మేనేజ్‌మెంట్‌కు వెళ్లబోసుకున్నా స్పందించలేదు. తిరిగి అతడిదే తప్పన్నట్టు శిక్షించింది. దీంతో సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు.


 వెస్ట్‌ యోర్క్‌షైర్‌‌‌లో బ్రిటిష్‌ బంగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీపై టోనీ ఫిన్ అనే మాజీ ఉద్యోగి ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. ఆ సంస్థలో 24 ఏళ్లపాటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన తనను అక్కడ సూపర్‌వైజర్‌ బట్టతల అంటూ వేధింపులకు గురిచేశాడని ఆరోపించాడు.


సూపర్‌వైజర్ జామీ కింగ్ తన పరిధి దాటి వేధించడంతో యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అతడిపై చర్యలు తీసుకోకపోగా.. తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపాడు. అక్కడితో ఆగకుండా వివక్షతో వ్యవహరించి అన్యాయంగా తనను గతేడాది మేలో ఉద్యోగం నుంచి తొలగించారని పిటిషనర్ పేర్కొన్నాడు. దీనిపై షెఫీల్డ్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. జుట్టు తక్కువగా ఉందన్న కారణంగా ఆఫీసుల్లో పనిచేసే మగాళ్లను ‘బట్టతల’ పేరుతో పిలవడం... అవమానించడమా? లైంగికంగా వేధించడమా? అన్న అంశంపై ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో వాదనలు జరిగాయి.


న్యాయమూర్తి జోనాథాన్‌ బ్రెయిన్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు సంస్థ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ... బట్టతల స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా ఉండవచ్చని తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన ట్రైబ్యునల్‌... మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోందని పేర్కొంది. దీన్ని లైంగిక వేధింపులుగా పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ‘బట్టతల’ అని పిలవడం వల్ల వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించడమేనని, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది.


అంతేకాదు, ఇది భయాందోళనకు గురిచేసే చర్యేనని స్పష్టం చేసింది. బాధితుడ్ని వేధింపులకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు... సదరు సంస్థ నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఆ మొత్తాన్ని త్వరలోనే నిర్ణయిస్తామంటూ విచారణను వాయిదా వేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com