ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో మావో కూడా ఒకరు. కమ్యూనిస్టులు చైనాలో అధికారంలోకి వచ్చిన తర్వాత మావో ప్రపంచానికి తెలిశాడు. చైనాలో పిన్నలు, పెద్దలు ఆయన నినాదాలను, ఆయన రచనలను అధ్యయనం చేశారు. మావో మంచి కవి కూడా. అందుకే ఆయన రచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాంటి మావో రాసిన లేఖకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.
మావో జెడాంగ్ స్వయంగా రాసిన ఓ లేఖను ముగ్గురు చోరీ చేశారు. ఈ కేసులో వారికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. ఆ లేఖ వందల మిలియన్ డాలర్ల విలువైనది.
2020 సెప్టెంబర్‌లో ఫూ చున్‌జియావో ఆర్ట్ గ్యాలరీలో భారీ చోరీ జరిగింది. అప్పుడు ఈ లేఖను కూడా దొంగిలించారు. ఆ ఉత్తరంతో పాటు చాలా విలువైన చైనీస్ స్టాంపులు కూడా మాయం అయ్యాయి. మావో లేఖను ఆ దొంగలు ఎత్తుకెళ్లి... చాలా తక్కువ ధరకు విక్రయించినట్టు తెలుస్తుంది. వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి ఆ లెటర్‌ను రెండుగా చింపేశాడు. ఆ లెటర్‌లో 1929 పొలిట్‌బ్యూరో నివేదిక, మావో రాసిన కవితలు ఉన్నట్టు గుర్తించారు. ఆ ఉత్తరం ఖరీదు సుమారు 300 మిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా.
ఈ చోరీలో హో యిక్ చుయి, నాగ్ వింగ్ లున్, హుయి పింగ్ కేలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు శిక్ష ఖరారు చేసింది. కాగా మావో జెడాంగ్ చైనాలో పెద్ద నేత. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విప్లవం విజయవంతం చేసి చైనాలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించారు. దాంతో ఎంతోమంది ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. ఆయన 1949లో చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. అప్పటి నుంచి 1976లో మరణించే వరకు మావో చైనాను పరిపాలించారు.