ఇటీవల కొన్ని నెలల కిందట చైనాలో జరిగిన విమాన ప్రమాదానికి కారణం పైలెట్, కోపైలెట్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో చైనాలో కన్‌మింగ్ నుంచి గ్వాంగ్జౌకు బయల్దేరిన బోయింగ్ 737 విమానం గత మార్చి నెలలో సౌత్ గ్వాంగ్జి ప్రావిన్స్‌లో కూలిపోయిన సంగతి తెలిసిందే. గంటకు 700 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోన్న ఈ విమానం.. 29 వేల అడుగుల ఎత్తు నుంచి అకస్మా్త్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది సహా విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలు కోల్పోయారు. చైనా చరిత్రలో ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి విస్మయం గొలిపే అప్‌డేట్ బయటకొచ్చింది.
కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించగా... కాక్‌పిట్‌లో ఉన్న ఎవరో ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చారని తేలింది. బ్లాక్ బాక్స్ ఫ్లయిల్ రికార్డర్లను విశ్లేషించిన అమెరికా అధికారులు ఈ విషయమై నిర్ధారణకు వచ్చారు. ఎవరో కావాలనే కాక్‌పిట్ నుంచి బలవంతంగా విమానాన్ని వేగంగా కిందకు పడిపోయేలా చేశారని వారు తెలిపారు. విమానం వేగంగా కూలిపోతున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, సమీపంలోని విమానాల నుంచి పదే పదే కాల్స్ చేసినా ఆ విమానంలో పైలెట్లు స్పందించలేదని అధికారులు తెలిపారు.
విమానం కూలిపోగానే చైనా దర్యాప్తు ప్రారంభించగా.. దానికి సహకరించడానికి అమెరికా నుంచి సైతం బోర్డ్ ఇన్వెస్టిగేటర్లు, బోయింగ్ అధికారులు మే 10న చైనా వెళ్లారని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ చైర్‌పర్సన్ జెన్నీఫర్ హోమెండీ తెలిపారు. విమానం కూలిపోవడానికి భద్రతాపరమైన కారణాలేవీ కనిపించడం లేదని ఆమె చెప్పారు.
కాక్‌పిట్‌లో బయటి వ్యక్తులెవరూ ప్రవేశించే అవకాశం లేకపోవడంతో విమాన ప్రమాదానికి కారణం పైలెట్, కోపైలెట్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవని.. ఆర్థికంగా, కుటుంబ పరంగానూ ఎలాంటి ఇబ్బందులు లేవని చైనా ఈస్ట్రన్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. కాక్‌పిట్ భద్రతను ఉల్లంఘించారనడానికి విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్ ఏదీ పంపలేదని చైనా అధికారులు తెలిపారు.