తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఉత్తర కొరియా ప్రజలు తమ సాంప్రదాయ చికిత్సల వైపు దృష్టి సారిస్తున్నారు. దాంతోనే కరోనాను తాము ఎదుర్కోగల మన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ కేసులతో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అక్కడ రోజురోజుకు జ్వర బాధితులు పెరుగుతున్నారు. దాంతో కరోనా వైరస్ నుంచి బయటపడ్డానికి ఉప్పు నీటితో గార్గిల్ చేయమని నార్త్ కొరియా పౌరులను ఆదేశించినట్టు తెలుస్తుంది. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి సంప్రదాయ చికిత్సలే ఉత్తమమమైనవని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. సంప్రదాయ చికిత్సలే ఉత్తమమని ఓ మహిళ ఆ దేశ అధికారిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు రాయిటర్స్ వెల్లడించింది.
తన పిల్లలు రోజుకు రెండుసార్లు ఉప్పునీరు పుకిలిస్తున్నారని ఆమె పేర్కొంది. కరోనా ఎదుర్కోవడానికి ఉప్పు నీటితో పాటు జ్వరం నుంచి ఉపశమనం పొందేందుకు సంప్రదాయకంగా ఉపయోగించే విల్లో లీఫ్ టీని రోజుకు మూడుసార్లు తాగమని ప్రభుత్వం సిఫార్స్ చేసినట్టు రాయిటర్స్ పేర్కొంది. అలాగే అక్కడి వైద్యులు కోవిడ్ బారినపడిన వారికి అల్లం టీ తాగమని చెబుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఉత్తర కొరియాలో 1.7 మిలియన్లకుపైగా జ్వరంతో బాధపడుతున్నట్టు అక్కడి మీడియా కేసీఎన్‌ఏ ప్రకటించింది. బుధవారం ఒక్క రోజే 2.32 లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. కొత్తగా ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కు చేరుకుంది. కరోనా అనుమానిత లక్షణాలతో 6,91,170 మంది క్వారంటైన్లో ఉన్నారు. ఇంతమంది జ్వరంతో బాధపడుతున్నా ప్రభుత్వం మాత్రం వాటిని కరోనా కేసులుగా ప్రకటించ లేదు.