రబీ ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లను ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మాకంగా తీసుకుంటే.. క్షేత్రస్థాయిలో రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 17వేల మంది రైతులు ఆధార్‌తో లింక్ కాలేదన్నారు. దీంతో పెద్ద కుంభకోణం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిలో రైస్ మిల్లుల యజమానులు, అధికారుల జోక్యం ఉందని ఆరోపణలు చేశారు. ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారని.. దీనికి సంబంధించి తన దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని.. దీనిపై సీఐడీ విచారణ కోరతానన్నారు. స్వయంగా అధికార పార్టీ ఎంపీ కుంభకోణం జరుగుతుందని ఆరోపించడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు రాజ్యసభ అభ్యర్థులు ఎంపికపైనా బోస్ స్పందించారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు పదవులను బీసీలకు ఇచ్చారన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే పదవుల్ని సామాన్య బీసీలకు కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగించిందని.. ఇది చంద్రబాబు ఊహకు సైతం అంది ఉండదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎప్పుడూ బడా పారిశ్రామిక వేత్తలకే రాజ్యసభ సభ పదవులు కట్టబెట్టారన్నారు.