వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసిపి నాయకత్వం మళ్లీ సామాజిక వర్గాల వారీగా వల వేసే దిశగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుంది. ఈ నేపథ్యంలోనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్న వైసిపి నాయకత్వం తాను ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు, సామాజిక న్యాయం తమతోనే సాధ్యమని చెప్పేందుకు సిద్ధమవుతోంది.
ఈ బస్సు యాత్ర ద్వారా ప్రధానంగా సామాజిక న్యాయం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. ఈ అంశాలను విస్తృత ప్రచారం చేసేందుకు బస్సు యాత్ర ఉపయోగపడుతుందని చెబుతున్నారు. యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే బస్సు యాత్ర, సభల కార్యక్రమానికి కొన్ని పేర్లను ప్రతిపాదించి జగన్‌తో చర్చించారు.. జయహో జగనన్న, సామాజిక న్యాయ నిర్మాత వంటి పలు పేర్లను పరిశీలిస్తున్నారు.
ఓవైపు టీడీపీ బాదుడే, బాదుడు అంటూ ప్రజల్లోకి వెళుతోంది. స్వయంగా అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.. అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఉత్తరాంధ్రలో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు రాయలసీమలో కొనసాగుతోంది. ఇటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గడప, గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఊరికి వెళుతున్నారు. సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ.. స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీకి చెక్ పెట్టేలా కౌంటర్‌గా వైఎస్సార్‌సీపీ ఈ బస్సు యాత్రకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. జగన్ ఎస్టీ, ఎస్సీ, బీసీలకు పెద్ద పీట వేస్తున్నారని.. పదవుల విషయంలోనూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార పార్టీ భావిస్తోంది. రాజ్యసభ సీట్ల విషయంలోనూ సామాజిక సమతూల్యం పాటించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా ఈ అంశాలను బస్సు యాత్రలో ప్రస్తావిస్తాము అంటున్నారు.