తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27, 28 తేదిల్లో ఒంగోలులో జరగనున్న మహానాడు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే జిల్లాలోని ఆయా నియోకవర్గాల్లో నెలకొన్న విభిన్న పరిస్థితుల నుంచి టీడీపీ బయటపడలేకపోతోంది. ఈ నేపథ్యంలో మహానాడుతోనైనా టీడీపీలో జోష్ వస్తుందా... అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా మహానాడుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే పలు మార్లు సమీక్షించారు. మహానాడు కమిటీలతో మంతనాలు జరిపారు.
ఒంగోలు సమీపంలోని మండవవారిపాలెంలో టీడీపీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించడం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా బుధవారం భూమి పూజ వంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ నెల 27, 28 తేదిల్లో రెండు రోజుల పాటు మహానాడు జరగనుంది. మహానాడుకు ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులు వేగవంతం చేయాలని నేతలను ఆదేశించారు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.
ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు మొదట భావించారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వేదికను మార్చారు. మహానాడులో రాష్ట్ర పరిస్థితుల పై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై మహానాడు వేదికగా నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇటీవల కుప్పంలో పర్యటించిన సమయంలో చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో యువతకే అధికశాతం సీట్లు ఉంటాయని స్పష్టం చేశారు. సీనియర్ నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కూడా చెప్పారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉందని, ప్రజల్లో నిత్యం ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని నేతలకు స్పష్టం చేశారు.
గట్టిగ చెప్పాలంటే నాలుగేళ్ల తరువాత నిర్వహిస్తున్న మహానాడు ఇది. 2018తరువాత టీడీపీ సభ జరిగింది లేదు. రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈ సారి మహానాడు దిశ దశ అనే విధంగా ఉంది. ఈ మహానాడు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుంటామని చెబుతున్న తమ్ముళ్లకు ఈ రాజకీయ తీర్మాణం దిశా నిర్దేశం చేసే విధంగా ఉండొచ్చని అంటున్నారు.