ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో కొందరు కొంత కాలం పాటు సంబంధం కొనసాగిస్తున్నారు. ఏ మాత్రం తమ ప్రియురాలో, ప్రియుడో బ్రేకప్ చెబితే తట్టుకోలేకపోతున్నారు. అవసరమైతే అవతలి వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇదే కోవలో ఓ ప్రియుడు తన ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. బ్రేకప్ చెప్పిందని కక్ష పెంచుకుని గోవా బీచ్‌కు తీసుకెళ్లి, అక్కడ ప్రాణాలు తీశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గోవాకు చెందిన కిషన్ కలంట్కర్(26) అనే యువకుడు కొన్నాళ్లుగా ఓ యువతి (19)ని ప్రేమిస్తున్నాడు. అతడి వ్యవహార శైలి నచ్చక ఆమె ఇటీవల బ్రేకప్ చెప్పింది. తమ ప్రేమ బంధం ఇక కొనసాగదని కరాఖండీగా తేల్చి చెప్పేసింది. దీంతో కిషన్ పగతో రగిలిపోయాడు. బ్రేకప్ చెప్పడం ఏ మాత్రం తట్టుకోలేకపోయాడు. బుధవారం సౌత్‌గోవాలోని వెల్సాన్ బీచ్‌కు కిషన్ వెళ్లాడు. అక్కడికి తన మాజీ ప్రేయసిని కూడా పిలిచాడు. తనను విడిచి వెళ్లొద్దని, చివరిగా బ్రతిమిలాడాడు. అయినప్పటికీ ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో పొడిచి చంపాడు. ఆ యువతి ప్రాణం పోయిందని తెలుసుకున్న తర్వాత, మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంటనే గాలింపు చేపట్టి గురువారం నిందితుడిని అరెస్టు చేశారు.