పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నారంటే కాస్త ముస్తాబయి వెళ్తుంటారు. లేకపోతే హుందాగా నిలిచే డ్రస్ కోడ్ తో వెళ్తారు. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం అక్కడి ఓటర్లు పోలింగ్ కేంద్రానికి అండర్ వేర్లతో వెళ్లారు. దీనికి ఓ కారణముంది. ఇదిలావుంటే ఆస్ట్రేలియాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడి లేబర్ పార్టీ.. లిబరల్ పార్టీని ఓడించింది. ఆ దేశ కొత్త ప్రధానిగా ఆంటోని ఆల్బనీస్ కానున్నారు. అయితే ఈ పోలింగ్ సమయంలో జరిగిన ఓ తంతు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఓట్లు వేయడానికి ఎవరైనా.. నీట్‌గా తయారై వెళ్తారు. అక్కడ కొంతమంది కేవలం అండర్ వేర్స్‌లో వెళ్లి ఓట్లు వేశారు. అదెలా అనుకుని ఆశ్చర్యపోతున్నారా..? కానీ నిజం. ఎవరైనా ఒంటి నిండా దుస్తులు లేకుండా బయటకు రాలేం. అలాంటిది.. అండర్ వేర్‌తో ఓటు వేయడం అంటే.. అదొక సాహసమే. అయితే అలా వారంతా వెళ్లి ఓటు వేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
నిజానికి ఆస్ట్రేలియాలో మూడేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో భాగంగా శనివారం పోలింగ్ జరిగింది. దీంతో అక్కడి ఓటర్లు ఆ రోజు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. కొందరు మాత్రం కేవలం అండర్‌వేర్‌తో ఓటు వేశారు. దీనికి ఓ కంపెనీ ఆఫరే కారణం. అండర్ వేర్‌తో ఓటేస్తూ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే తమ కంపెనీ స్విమ్ వేర్‌ను ఫ్రీగా ఇస్తామని బడ్జీ స్మగ్లర్స్ అనే కంపెనీ ప్రకటించింది.
అలా ఆ కంపెనీ ఇచ్చిన ప్రకటనకు పెద్దఎత్తున స్పందన వచ్చింది. దానికి ఆ సంస్థ కూడా ఆశ్చర్యపోయింది. వందలాది మంది రంగు రంగుల అండర్‌వేర్స్‌ను ధరించి ఓటు వేశారు. సంబంధిత ఫోటోలను #SmugglersDecide హ్యాష్ టాగ్‌తో షేర్ చేశారు. తాము ఇచ్చిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందని కంపెనీ ప్రతినిధులు అన్నారు. ఓటు వేసిన వారందరికీ గిఫ్ట్‌లు పంపిస్తామని వెల్లడించారు.
ఇక ఆంటోని ఆల్బనీస్ ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎంపీగా, ఉప ప్రధానిగా, మంత్రిగా చాలా పదవుల్లో బాధ్యతలను నిర్వర్తించారు. ఆల్బనీస్ ఈ ఎన్నికల్లో ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. మంచి మంచి హామీలతో వారి నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.