పెట్రోల్ ధరలు ఆకాశనంటిన నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నం చేస్తోంది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ. తన ఫ్లాగ్‌షిప్ ఈ-స్కూటర్ ఎస్1 ప్రొ ధరలను పెంచుతున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఎస్1 ప్రొ ధర ఇన్ని రోజులు ఎక్స్‌షోరూంలో రూ.1.30 లక్షలుగా ఉండేది. ఫేమ్ 2 రాయితీలను, రాష్ట్ర రాయితీలను కలిపిన తర్వాత ఎక్స్‌షోరూం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ధరలను ప్రస్తుతం రూ.1.40 లక్షలకు పెంచింది. ఈ ఏడాది జనవరిలో ఈ బైకును బుక్ చేసుకున్న కస్టమర్లందరికీ కూడా ఈ ధర వర్తిస్తుందని కంపెనీ చెప్పింది. ఎస్1 ప్రొ దేశంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తాజా బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది.
అయితే ఓలా ఎస్1 ధరను కంపెనీ మార్చలేదు. ఈ స్కూటర్ ధర ప్రస్తుతం ఫేమ్ 2, రాష్ట్ర రాయితీలతో కలుపుకుంటే ఎక్స్‌షోరూం ధర ఢిల్లీలో రూ.85,099గా ఉంది. మే 21 నుంచి ఓలా స్కూటర్లు ఎస్1, ఎస్1 ప్రొలను కొనుగోలు చేసుకునేలా కంపెనీ విండోలను తెరిచింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసుకోవాలనుకునే కస్టమర్లు ప్రస్తుతం ఈ స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ గతేడాది ఆగస్టులో ఈ-స్కూటర్లను ప్రవేశపెట్టిన తర్వాత.. కంపెనీ తొలిసారి ఈ ధరల పెంపును చేపట్టింది. అయితే ధరల పెంపును ఎందుకు చేపట్టిందో కంపెనీ వెల్లడించలేదు. ఎస్1 ప్రొ మోడల్ ఓలా ఎలక్ట్రిక్‌ను సంవత్సరం వ్యవధిలోనే నెంబర్ 1 ఎలక్ట్రిక్ కంపెనీలలో ఒకటిగా నిలిపింది.
ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రొ 131 కి.మీల రియల్ వరల్డ్ మైలేజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఐడియల్ కండీషన్లలలో ఇది 185 కి.మీల రేంజ్‌ను అందిస్తోంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ. హీరో ఎలక్ట్రిక్‌ను దాటేసి ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్‌గా నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు నెలలో సుమారు 40 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయి. నెలలో 10 వేల అమ్మకాలను తాకిన కంపెనీగా ఓలా నిలిచింది.
అయితే గత నెలలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అట్టుకోవడంతో.. 1,441 యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లను రీకాల్ చేసింది. భవిష్యత్‌లో మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలంటుకునే అవకాశం ఉందని, కానీ ఈ సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ చెప్పారు. భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడం చాలా కీలకమన్నారు.