కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పథకాన్ని పొందాలనుకొనే వారికి ఈ ముఖ్య సమాచారం. ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన స్కీమ్(పీఎం కిసాన్) కింద అర్హులైన రైతులు ప్రయోజనాలు పొందాలంటే ఈ నెల చివరి లోపల ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఈ గడువు అంతకుముందు మార్చి 22, 2022 వరకు ఉంటే.. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నెల చివరి వరకు సమయం ఇచ్చింది. ప్రస్తుతం మరో 8 రోజుల్లో ఈ గడువు ముగస్తుంది. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు ఈకేవైసీ అనేది తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ఎవరైనా రైతులు ఈకేవైసీని చేపట్టకపోతే... వారికి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద విడుదల చేసే తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు అందవు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతేడాది రూ.6 వేలను రైతులకు అందిస్తోంది. ప్రతేడాది మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున ఇస్తోంది. అర్హులైన రైతులకు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోనే జమ చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేయబోతుంది. ఈకేవైసీ ఆధారిత బయెమెట్రిక్‌ను చేపట్టేందుకు రైతులు దగ్గర్లోని కామన్ సర్వీసు సెంటర్లను సంప్రదించాల్సి ఉంది. లేదంటే ఓటీపీ ఆధారితంగా కూడా ఈ ప్రక్రియను చేపట్టుకోవచ్చు. సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను చేపడితే సర్వీసు ఛార్జీల కింద రూ.37ను చెల్లించాలి.
ఇంట్లోనే కూర్చుని ఈ-కేవైసీని పూర్తి చేసుకునే ప్రక్రియ...
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌పేజీ https://pmkisan.gov.in/ సందర్శించాలి.
ఈ పేజీలో కుడి వైపున్న ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్ నొక్కాలి.
ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి.
గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని నమోదు చేయాలి.
అన్ని వివరాలు మ్యాచ్ అయితే ఈకేవైసీ పూర్తవుతుంది. లేదంటే ఇన్‌వాలిడ్ అని వస్తుంది. ఈ-కేవైసీని పూర్తి చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే స్థానికంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాలను కూడా సంప్రదించవచ్చు.