నీరో చక్రవర్తి చందంగా సీఎం వై.ఎస్.జగన్ తీరు ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పలు డిమాండ్లతో కూడిన ఓ లేఖను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన రాశారు. కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని.. పొరుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని లారీ యజమానులు అక్కడే ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను లోకేష్ ప్రస్తావించారు.
‘రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి చందంగా ఉంది మీ తీరు. నిత్యావసరాలు ధరలు పెంచి, రకరకాల కొత్త పన్నులు విధించి. ఉన్న పాతపన్నులని రెట్టింపు చేసి, అన్ని చార్జీలు అమాంతంగా పెంచేసి సామాన్యుల బతుకు దుర్భరం చేశారు. మీ బాదుడే బాదుడు దెబ్బకి జనాలు అల్లాడిపోతుంటే, చిద్విలాసంగా నవ్వుతూ మీకు మీరే మీ పాలన బాగుందని సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. మీ పాలన చాలా చాలా చాలా ఘోరంగా ఉందని గడప గడపకీ వెళ్తోన్న మీ నేతల మొహం మీదే ప్రజలు ఛీకొట్టి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో పెట్రోల్ డీజిల్ లపై పన్నులు తగ్గించి ఆ మేరకు వాటి ధరలు తగ్గేలా నిర్ణయం తీసుకుంది’అని గుర్తు చేశారు.
‘కేంద్రంతోపాటు 23 రాష్ట్రాలు కూడా తాము వేస్తోన్న పన్నులని తగ్గించుకుని ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగిస్తే, మీ నుంచి స్పందన శూన్యం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు సరికదా, పెంచుకుంటే తప్పేంటంటూ కోట్ల రూపాయలతో దొంగ లెక్కలతో సొంత పత్రికలకు ప్రకటనలు ఇచ్చుకోవడం మీకే చెల్లింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పన్నులు తగ్గించి ఆమేరకు పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించినా, ప్రతిపక్షనేతగా మీరు పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర పన్నులు తగ్గించాలని డిమాండ్ చేయడం న్యాయం. కేంద్రం, ఇతర రాష్ట్రాలు తగ్గిస్తే, మీరు మాత్రం పెంచేస్తారు, అదే విషయం ప్రతిపక్షంగా మేము అడిగితే అన్యాయం.. ఇదేం నీతి సీఎం గారూ! టిడిపి హయాంలో ప్రజల పై పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్ ని రూ.2కి తగ్గించాం. మీరు మూడేళ్లలో ఒక్క పైసా తగ్గించడం మాట అటుంచి పెంచుకుంటూ పోయారు’అంటూ విమర్శించారు.
‘అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పెట్రోల్‌పై మీ సర్కారే 31 శాతం వ్యాట్ విధిస్తున్నారు. దీనికి తోడు అదనపు వ్యాట్ అంటూ లీటర్ పెట్రోల్‌ఫై 4 రూపాయలు. రోడ్డు సెస్ 1 రూపాయి వేసి దేశంలోనే అతి ఎక్కువగా పెట్రోల్ ధర ఏపీలోనే అమ్ముతూ సామాన్యప్రజల్ని దోచుకుంటున్నారు. కేంద్రం రెండుసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భాలలో పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలూ తగ్గింపు నిర్ణయాన్ని తీసుకుని ప్రజలకి మేలు చేస్తే, మీరెందుకు ప్రజల్ని మరింత భారాలు వేస్తున్నారో సమాధానం ఇవ్వాలి. కేంద్రం తాజాగా లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేరకు ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా లీటర్ పెట్రోల్ రూ.9.50, డీజిల్ రూ.7 వరకూ తగ్గనుంది’అన్నారు.