పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య వాతావరణం మొదలైంది. పరిశ్రలము నిబంధనల ఉల్లంఘనలు కూడా ఈ కాలుష్యం పెరుగుదలకు కారణాలు కాగా భారీగా పెరిగిన వాహనాల వాడకం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. మనిషిపై తీవ్ర ప్రభావం కాలుష్యం చూపుతోంది. ఇక గర్భవతుల విషయంలో ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరముంది. తల్లి కడుపులోని శిశువు కూడా కాలుష్యానికి ప్రభావితం అవుతున్నారని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. 2019 ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది నెలలు నిండకముందే జననాలు చోటుచేసుకున్నాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అలాగే దాదాపు 30 లక్షల మంది శిశువులు తక్కువ బరువుతో జన్మించడానికి వాయుకాలుష్యం కారణమైందని ఈ నివేదిక పేర్కొంది. గర్భంలోని శిశువును కూడా కాలుష్యం వదలట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రిమెచ్యుర్ డెలివరీతో పాటు పుట్టుకతో కొన్ని లోపాలకు కాలుష్యం కారణమవుతోందని అది అంటోంది. గర్భంలోని బిడ్డలకు ఆక్సిజన్, పోషకాహారం అన్నీ తల్లి నుంచే అందుతాయి. తల్లి తినేవి, అనుభూతి చెందేవి, పీల్చ గాలి.. అన్నీ పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయి. గాలి, నీరు, శబ్దం కాలుష్యం.. బిడ్డపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
గర్భం దాల్చిన తొలి నెలలో బిడ్డపైన కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లి ఊపిరి తీసుకున్నప్పుడు కాలుష్యం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. కొన్ని సూక్ష్మ పదార్థాలు ఊపిరితిత్తుల గోడలకే అంటుకుపోతాయి. కొన్ని రక్తంలో కలిసిపోతాయి. కొన్ని ప్లాసెంటా (మాయ) వరకూ చేరతాయి. అక్కడి కాలుష్య పదార్థాలు పొగైతే వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా గర్భస్థ శిశువుకు రక్త ప్రసరణలో ఇబ్బంది కలుగుతుంది.
బిడ్డకు పోషకాలు ఆ రక్తం ద్వారానే అందుతాయి. తక్కువ రక్త ప్రసరణ వల్ల బిడ్డ ఎదుగుదల మందగిస్తుంది. ఫలితంగా శారీరక, మానసిక లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్లాసెంటాకు రక్తప్రసరణ సరిగా లేకపోతే అది త్వరగా మెచ్యూర్ అవడంతో ప్రిమెచ్యుర్ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది’ తల్లి వాయు కాలుష్యానికి గురికావడం వల్ల.. శిశు మరణాలు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఊపిరితిత్తులు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, అలెర్జీల వంటి దీర్ఘకాలక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
మనం ఇప్పటికిప్పుడే.. ఈ కాలష్యాలను తగ్గించలేం.. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ ప్రభావలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు. వీలైనంత వరకు ఇంటి లోపల ఉండటం, బయటకెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ ధరిస్తే.. గర్భధారణపై వాయు కాలుష్యం యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించవచ్చు.
ఎక్కువగా బయటకు వెళ్లకండి. ముఖ్యంగా కాలుష్య ప్రాంతాలకు వెళ్లడం మానండి. ఒక వేళ మీరు తప్పని సరిగా వెళ్లాలంటే, మాస్క్ ధరించి వెళ్లడం మంచిది.
పొగతాగే వారికి దూరంగా ఉండటం మంచిది. మీ ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తే.. వారిని బయటకు వెళ్లమని చెప్పండి.
ఇంట్లో వాయు కాలుష్యం తగ్గించడానికి అధిక సామర్థ్యం గల పార్టికల్ ఎయిర్ ఫిల్టర్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
ఒకవేళ ఇళ్లు శుభ్రం చేస్తుంటే.. ఆ దుమ్ము, ధూళికి దూరంగా ఉండటం మంచిది.