పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం సంచల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నుండి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లాను తొలగించి, వెంటనే అరెస్టు చేయించారు. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మందులు, పరికరాలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం వేల కోట్లతో టెండర్లు వేసింది. మంత్రి తాను ఆమోదించిన టెండర్ల కోసం 1 పర్సెంట్ కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలొచ్చాయి. విజయ్ సింఘ్లాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తెలుసుకున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు.
డాక్టర్ సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించామని, ఆ తర్వాత పోలీసులు ఆయనను అరెస్టు చేశారని సీఎం భగవంత్ మాన్ చెప్పారు. మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని తనకు అధికారికంగా ఫిర్యాదు అందిందని, ఆ వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అవినీతిని ఆమ్ ఆద్మీ పార్టీ సహించదని, అందుకే మంత్రిపై వెనువెంటనే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మరోవైపు తాను కమీషన్ కోరినట్లు మాజీ మంత్రి డాక్టర్ విజయ్ సింఘ్లా అంగీకరించారు.