ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వివాదం రగులుతూనే ఉంది. ప్రస్తుతం కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రారంభించినప్పుడే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే బాగుండేదని, అయితే రాజకీయాల నేపథ్యంలోనే జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. దళిత సంఘాల నిరసనతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వారు కోరినట్లు అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై జిల్లా అంతటా పలువురు భగ్గుమన్నారు. దళితులు మినహా మిగిలిన సామాజిక తరగతుల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయని అమలాపురంలో వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కోనసీమ పేరునే జిల్లాకు కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సమకూరి జేఏసీగా ఏర్పడి అమలాపురానికి వచ్చారు. ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారిని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో కొందరు ఆందోళనకారులు ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఎస్పీ గన్‌మెన్‌కు, ఇతర పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో వారిని అదుపు చేసేందుకు అమలాపురంలో పోలీసులు భారీగా మోహరించారు.