కోనసీమలో అల్లర్లను అదుపు చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై అనుకూల, వ్యతిరేక వర్గాలు బుధవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని నెట్‌వర్క్‌లకు చెందిన సేవలను నిలిపివేస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లను పోలీసు ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించారు. పరిస్థితులు చక్కబడే వరకు ఇంటర్‌నెట్ సేవలు నిలిపి వేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇక జిల్లాకు కోనసీమ పేరును మాత్రమే కొనసాగించాలనే డిమాండ్‌తో కొంతకాలంగా కోనసీమ సాధన సమితి ఉద్యమిస్తోంది. ఈ ఆందోళనల కారణంగా వారం రోజులుగా అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. మంగళవారం కోనసీమ సాధన సమితి ఇచ్చిన పిలపుతో వేల సంఖ్యలో నిరసనకారులు ఒక్కసారిగా అమలాపురం తరలి వచ్చారు. వారు కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆగ్రహంతో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఎస్పీ సుబ్బారెడ్డితో సహా 20 మందికి గాయాలయ్యాయి. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో ప్రశాంతమైన కోనసీమ రణరంగంగా మారింది. దీనిపై స్పందించిన హోంమంత్రి వనిత అల్లర్లకు కారణమైన వారిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.