ఏపీ వ్యాప్తంగా ప్రజలను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. పగటిపూట ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. కోస్తా జిల్లాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎండ వేడిమి, మరో వైపు ఉక్కపోతతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. గాలిలో తేమ తగ్గడంతో ఉక్కపోత, వేడి వాతావరణం కనిపిస్తోంది. రోహిణి కార్తె కావడంతో బుధవారం ఎండలు మరింత గరిష్టంగా ఉండడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కోస్తాలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తణుకు, అత్తిలి, తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఉండ్రాజవరం ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక కోస్తా ప్రాంతంలో పలు జిల్లాలలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు వస్తే రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు చల్లబడతాయి. కేరళ ప్రాంతంలో జూన్ 1న నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.