పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, సబ్సిడీ వంటగ్యాస్‌పై భారీగా ధర తగ్గించిన కేంద్రం మరో గుడ్ న్యూస్ అందించింది. ఏటా దిగుమతి చేసుకునే వంటనూనెల ధరలపై కస్టమ్స్ సుంకం, సెస్ తొలగించింది. పంచదార ఎగుమతులపై ఆంక్షలు విధించి, దేశంలో దాని ధర పెరగకుండా చర్యలు తీసుకుంది. ప్రతి సంవత్సరం 20 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను ప్రభుత్వం మంగళవారం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం 2022-23, 2023-24 సంవత్సరాలకు కూడా వర్తిస్తుంది.
కేంద్ర ఉత్తర్వుల ప్రకారం మార్చి 31, 2024 వరకు, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై మొత్తం 80 లక్షల మెట్రిక్‌టన్నులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఈ మినహాయింపులతో దేశీయంగా వంటనూనెల ధరలు తగ్గుతాయి. ఈ నిర్ణయం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది వినియోగదారులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని సీబీఐసీ ట్వీట్ చేసింది. సోయాబీన్ ఆయిల్ ధరలు లీటరుకు రూ.3 తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పాటు స్టీల్, ప్లాస్టిక్ పరిశ్రమలో ఉపయోగించే కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా ఇనుప ఖనిజం, ఇనుప గుళికలపై ఎగుమతి సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది.