ప్రభుత్వం కొత్త జిల్లాలన్నింటినీ ప్రకటించినప్పుడే, వాటికి పేర్లు కూడా కేటాయించి ఉంటే బాగుండేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఏ జిల్లాకు లేని విధంగా కోనసీమ జిల్లా విషయంలో అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. గొడవాలను జరగాలని కోరుకుంది కాబట్టే ప్రభుత్వం ఇంత సుదీర్ఘ సమయం గడువు ఇచ్చిందని అన్నారు. అంబేద్కర్‌పై ప్రేమ ఉంటే ఆయన కోరుకున్న విధంగా ఎస్సీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని సూచించారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకే కోనసీమ జిల్లా విషయంలో ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చిందని పవన్ అన్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్‌ను హత్య చేశారని, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కోనసీమ అల్లర్లను ప్లాన్ ప్రకారం ప్రభుత్వం ప్రోత్సహించినట్లు ఉందని అన్నారు. అల్లర్లకు జనసేనను బాధ్యులను చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా జిల్లాకు ఒక మహనీయుని పేరు పెట్టడానికి కొందరు వ్యతిరేకిస్తుంటే, అది ఆ మహనీయునిపై వ్యతిరేకతగా భావించొద్దని అన్నారు. కర్నూలు జిల్లాకు దళిత సీఎం సంజీవయ్య పేరును కూడా కొందరు రాయలసీమ వాసులు వ్యతిరేకించారన్నారు. తమ ప్రాంతానికి కర్నూలు మాత్రమే ఉండాలనే ఉద్దేశం తప్పా మరే ఇతర దురుద్దేశం వారికి లేదన్నారు.