భారతదేశంలో విమాన సర్వీసుల్ని అందిస్తున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై (Spicejet Airlines) అర్ధరాత్రి సైబర్ దాడి జరిగింది.దీంతో మే 25 ఉదయం కొన్ని ఫ్లైట్లు ఆలస్యం అయ్యాయి. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్‌పై రాన్సమ్‌వేర్ ఎటాక్ (Ransomware Attack) జరిగింది. "కొన్ని స్పైస్‌జెట్ సిస్టమ్స్ గత రాత్రి రాన్సమ్‌వేర్ దాడిని ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావం కారణంగా ఈరోజు ఉదయం బయలుదేరే విమానాలు ఆలస్యం అయ్యాయి. మా ఐటీ బృందం పరిస్థితిని సరిదిద్దింది. ఇప్పుడు విమానాలు సాధారణంగా నడుస్తున్నాయి" అని స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ట్విట్టర్‌లో వెల్లడించింది.
అయితే ఈ రాన్సమ్‌వేర్ ఎటాక్‌కు సంబంధించిన ఇతర వివరాలను స్పైస్‌జెట్ వెల్లడించలేదు. రాన్సమ్‌వేర్ ఎటాక్ అంటే సైబర్ నేరగాళ్లు సిస్టమ్స్‌పై దాడి చేసి, సిస్టమ్‌ను స్తంభింపజేస్తారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే సిస్టమ్‌లోని ముఖ్యమైన ఫైల్స్ డిలిట్ చేస్తామని బెదిరిస్తారు. డబ్బులు ఇస్తేనే సిస్టమ్స్‌ని అన్‌లాక్ చేసి యథాతథంగా పనిచేసేలా చేస్తారు. ఇలాంటి దాడిని రాన్సమ్‌వేర్ ఎటాక్ అని పిలుస్తారు. ఇదే తరహా సైబర్ దాడి స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్‌పై జరిగింది.