మహనీయుడు అంబేద్కర్ పేరును రాజకీయాల్లోకి లాగింది వైసీపీయేనని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అంబేద్కర్‌పై వైసీపీకే ప్రేమ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో బుధవారం మాట్లాడుతూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే చాలా పథకాలకు జగన్ తన పేరు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రశాంతమైన కోనసీమలో మంగళవారం చెలరేగిన విధ్వంసకాండను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు.
అమలాపురంలో జరిగిన దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కోనసీమ అల్లర్లలో పాల్గొనకపోయినా తమ పార్టీ పేరును ప్రభుత్వ పెద్దలు ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. తాము గుంటూరులో జిన్నా టవర్స్‌కు పేరు మార్చాలని డిమాండ్ చేస్తే, బీజేపీ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయించిందన్నారు. హిందూ వ్యతిరేక విధానాలను జగన్ ప్రభుత్వం విడనాడాలని సూచించారు.