రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధలతో ప్రజాగ్రహం పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా వంట నూనెల విషయంలో అమాంతంగా పెరిగిన ధరలు సామన్యుడిలో ఆగ్రహం రెట్టింపయ్యేలా చేస్తోంది. దీంతో ప్రజాగ్రహం తగ్గించేందుకు తాజాగా కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. ఇదిలావుంటే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో.. దేశీయంగా కూడా వంటనూనెల ధరలు సలసలమన్నాయి. భారత్ తనకు కావాల్సిన వంటనూనెల అవసరాలలో 60 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. భారత్‌కు ఎక్కువగా సన్‌ఫ్లవర్ ఆయిల్ బ్లాక్ సీ రీజన్ నుంచి దిగుమతి అవుతోంది. మలేషియాలో ఈ వంటనూనెల ఉత్పత్తి కూడా తగ్గింది. మొన్నటి దాకా పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించిన ఇండోనేషియా, ప్రస్తుతం ఈ బ్యాన్‌ను ఎత్తివేసింది.
అయిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్‌లపై ఉన్న ఇంపోర్టు లెవీని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గించాలని లేదా పూర్తిగా తీసివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టు ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. ఈ వారంలోనే తుది నిర్ణయం వెలువడనుందని పేర్కొన్నారు. దేశంలో భారీగా పెరుగుతోన్న వంటనూనెల ధరలను తగ్గించేందుకు కేంద్ర వద్దనున్న పరిమిత ఆప్షన్లలో పన్నులు తగ్గించడం ఒకటని సంబంధిత వ్యక్తులు తెలిపారు. భారత్ ఇప్పటికే పామాయిల్ వంటి చాలా వంటనూనెలపై బేస్ ఇంపోర్టు లెవీలను తీసేసింది. ఈ నూనెలను ఎవరైనా అక్రమంగా నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇన్వెంటరీ ఆంక్షలను కూడా ప్రభుత్వం విధించింది.
ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటంతో.. దేశీయంగా ద్రవ్యోల్బణం భగ్గుమంటోంది. ఏప్రిల్ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం భారత్‌లో ముఫై ఏళ్లలో తొలిసారి గరిష్ట స్థాయిలకు ఎగిసింది. పెరుగుతోన్న ధరలను పరిగణనలోకి తీసుకుని, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించింది. ప్రస్తుతం వంటనూనెలపై కూడా పన్నులను తగ్గించాలని చూస్తోంది.