చర్మం నిగనిగా మెరిసేందుకు చాలా మంది రకరకాల లేపనాలు వాడుతుంటారు. అవి ఫలితాన్నివ్వకపోగా చర్మ సమస్యలు చుట్టముడతాయి. దీంతో సమస్య నుంచి బయట పడేందుకు మరిన్ని ఆయింట్‌మెంట్లు, క్రీములు వినియోగిస్తారు. అయితే సహజంగా మనకు లభించే పదార్థాలతోనే నిగనిగలాడే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు మేకపాలు దోహదపడతాయని చెబుతున్నారు.
మేకపాలలో మాయిశ్చరైజర్ గుణాలు మెండుగా ఉన్నాయి. వీటిని శరీరంపై రాసుకోగానే లోపలికి ఇంకిపోతాయి. చర్మాన్ని సున్నితంగా, మృదువుగా తయారు చేస్తాయి. మనుషుల చర్మంలో ఉండే పీహెచ్ స్థాయిలు సమానంగా మేక పాలలోనూ ఉంటాయి. ఇవి చర్మం సహజత్వం పోకుండానే చక్కటి నిగారింపును సొంతం చేసుకునేలా చేస్తాయి. గజ్జి, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులను తగ్గించడంలో కృషి చేస్తాయి. ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లం కారణంగా చర్మంపై మృతకణాలు పోతాయి. ఫలితంగా చర్మంపై తేమ ఉండి, పొడిబారకుండా చేస్తాయి. ఇందులో యాంటి బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడతాయి. మేకపాలను శరీరానికి రాసుకుంటే చిటపటలాడే సమస్య తగ్గుతుంది. వీటిని ఫేస్‌మాస్క్‌గానూ ఉపయోగించొచ్చు. ఇతర సబ్బులు, క్రీములతో కలిపి ముఖానికి రాసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.