పెంచిన నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి ఎనుముల పల్లి బైపాస్ నందు గల సిపిఐ కార్యాలయం వద్ద నుండి బయలుదేరుతున్న వామపక్ష నాయకులు పోలీసులు ఎనుముల పల్లి బైపాస్ వద్ద అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
సోమవారం సిపిఐ , సిపిఎం పార్టీల నాయకులు పుట్టపర్తి గణేష్ కూడలిలోని సిపిఐ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం కు ర్యాలీ చేపట్టగా ఆదిలోనే పోలీసులు కొంత మంది నాయకులను అరెస్ట్ చేసి పుట్టపర్తి, బుక్కపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుట్టపర్తి అర్బన్ సీఐ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎనుముల పల్లి కూడలిలో మోహరించి పోలీసులు సిపిఐ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె. వి. వి ప్రసాద్ తో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సిపిఐ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటమయ్య తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకొని బుక్కపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులను ఛేదించుకుని పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పలు వాహనాల ద్వారా పుట్టపర్తి అర్బన్, బుక్కపట్నం పోలీస్ స్టేషన్ లకు తరలించారు. వామపక్షాల నాయకులను పోలీసులు స్టేషన్లకు తరలించగా, ఆయా పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్ లో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సిపిఐ సిపిఎం నాయకులతో పాటు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.