రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి లబ్ధిదారుల ఎంపికలో వివిధ రకాల ఆదాయ వనరులను ప్రామాణికంగా తీసుకుంది. రేషన్ కార్డు దగ్గర నుండి ప్రతి సంక్షేమ కార్యక్రమం వరకు 6 స్టెప్ వెరిఫికేషన్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ చేసే క్రమంలో వాలంటీర్ల సమాచారంతో పాటు వివిధ శాఖల వద్ద వున్న టెక్నీకల్ డేటాపై ఆధార పడింది. అయితే ఈ డేటా సేకరణలో జరుగుతున్న లోపాలతో కొంతమంది అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమౌతుంటే కొన్ని చోట్ల అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
పేదలందరికి ఇళ్ళ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో అర్హులను గుర్తించేందుకు సరైన ప్రాతిపదిక అంటూ ఏది అవలంభించలేదు. ఇంటి పన్ను వాలంటీర్ల సమాచారం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేశారు. కాగా,ఇంటి పన్నులు ఏళ్ల తరబడి కట్టని, ఆస్తి విక్రయించాకా పన్నులో పేరు మారని, అసలు ఇంటి పన్నులు లేని వారు అనేకమంది వున్నారు. ఇంటి స్థలాలకు ఆర్టీ పెట్టుకున్న వారు చెప్పిన సమాచారం ఆధారంగా వాలంటీర్లు దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ క్రమంలో సొంత ఇళ్ళు,స్థలాలు వుండి కూడా అనేక మంది జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు పొందారు. ఇళ్ళు లేని పట్టాలు పొందేందుకు అర్హత వున్న అసలైన లబ్దిదారులు అనేకమంది మిగిలి పోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం చేసుకున్న దరఖాస్తులు ఇంకా వేలల్లో పెండింగులో ఉన్నాయి.
ఏరివేతకు కరెంటు బిల్లు ఎందుకు?
అర్హులకు సంక్షేమ పథకాలను అందజేసే క్రమంలో లబ్దిదారుల ఎంపిక కోసం కరెంటు బిల్లు, సర్వీస్ నంబర్ డేటాను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. విద్యుత్ శాఖ వద్ద సర్వీస్ నంబర్, కరెంటు బిల్లు ఆధారంగా వినియోగదారుల సరైన సమాచారం వుండటమే ఇందుక కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిన వినియోగదారులను అమ్మ ఒడికి అనర్హులుగా ప్రకటించింది. ఇప్పుడు కరెంటు మీటర్ సర్వీసు నంబర్ ఆధారంగా కరెంటు మీటర్ ఎవరు పేరు మీద వుంది,మీటర్ వున్న వ్యక్తికి సొంత ఇల్లు వుందా వంటి తదితర అంశాలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటిటి సర్వే చేసి సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయనున్నట్లు సమాచారం.