దేనినైనా సమయస్పూర్తితో ఎదుర్కొంటో ఎంతటి సమస్యనైనా దాటేయవచ్చు. ప్రమాదాలను కూడా ఎదుర్కోవచ్చు. అది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్. మే 30, 2022 సమయం ఉదయం 8 గంటలైంది. కొద్దిపాటి ప్రయాణికులతో రైల్వేస్టేషన్ సందడిగా ఉంది. ఇంతలో ఓ రైలు. స్టేషన్ దగ్గరకు వచ్చి ఆగేందుకు సిద్ధమవుతుంటే ఓ మహిళ హడావుడిగా వచ్చి కదిలే రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆమెను ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరి పనుల్లో వారున్నారు. ఆ మహిళ రైలు ఎక్కేద్దామనుకుంది గానీ... ఎక్కుతూ జారిపోయింది. అలా జారుతూ... పట్టాల మధ్య పడిపోతున్న సమయంలో అద్భుతం జరిగింది. సడెన్‌గా మెరుపులా వచ్చిన రైల్వే రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్ ఆమెను ఒక్కసారిగా పట్టుకొని వేగంగా వెనక్కి లాగేశాడు. ఆయన అంత త్వరగా రావడం, వెంటనే ఆమెను లాగడం వల్ల ఆమెకు ప్రాణాలు దక్కాయి. లేదంటే రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయేదే. ఒక్క క్షణంలో అంతా తారుమారయ్యేది.
దీనికి సంబంధించి రైల్వే శాఖ... ట్విట్టర్‌లోని @RailMinIndia అకౌంట్‌లో మే 31, 2022 నాడు ఓ ట్వీట్ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోని ఇప్పటివరకూ 19 వేల మందికి పైగా చూడగా... 360 మంది లైక్ చేశారు.
జీవితం క్షణ భంగురం అంటారు. అంటే... జీవితం నీటి బుడగ లాంటిదని అర్థం. ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు. మృత్యువుకు వేరే పనేమీ ఉండదు. ప్రాణాలు తియ్యడమే పని. ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని ఎదురుచూస్తూ ఉంటుంది. కాబట్టి... మనమే జాగ్రత్త పడాలి. కదిలే రైలు ఎక్కితే... బ్యాలెన్స్ తప్పుతామని అందరికీ తెలుసు.. అయినా మనలో చాలా మంది ఆ పొరపాటు చేస్తారు. కదిలే రైలు నుంచి దిగితే... బ్యాలెన్స్ తప్పుతామని తెలిసి కూడా మనలో కొంత మంది అదే పని చేస్తారు. ఆ తర్వాత సమస్యల్లో పడతారు అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ జవానును మెచ్చుకుంటున్నారు.
కొంతమంది రైళ్ల బోగీల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. మరికొందరు ఆటోమేటిక్ లాక్ డోర్లను పెట్టాలని సూచిస్తున్నారు. "RPF మంచి పని చేసింది" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా... "డోర్ క్లోజర్ వ్యవస్థకు అయ్యే పెట్టుబడి కంటే జీవితం విలువైనది. దయచేసి ఆటో డోర్ క్లోజర్ సిస్టం తీసుకురండి" అని మరో యూజర్ రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు.
"ఇలాంటిదే నేను ఓ ఘటన చూశాను. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఓ కుర్రాడు కదిలే రైలు ఎక్కబోతూ పడిపోయాడు. ఓ జవాన్ అతన్ని కాపాడాడు. అప్పటికి ఆ రైలు ఇంకా ఆగలేదు" అని మరో యూజర్ తెలిపారు. "ఆగని రైలులోకి ఎక్కడం, దిగడం రెండూ ప్రాణాంతకమే" అని రైల్వే శాఖ తన ట్వీట్‌లో తెలిపింది.