జూన్ నెల అనేక అంశాల్లో మార్పులు తీసుకొచ్చింది. అనేక పాత నిబంధనల స్థానంలో కొత్తవి వచ్చాయి. దీంతో జూన్ నెలను మార్పుల నెలగా పేర్కొన్నవచ్చు. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని వల్ల ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పీఎఫ్ , ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ , ఐటీఆర్ ఫైలింగ్, గోల్డ్ హాల్ మార్కింగ్ , వడ్డీ రేట్లు ఇలా పలు అంశాలు మారబోతున్నాయి. దీని వల్ల సామాన్యులపై నేరుగానే ప్రభావం పడబోతోంది. అందవల్ల జూన్ నెలలో ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఝలక్ ఇచ్చింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచేసింది. జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియం రూ. 330 నుంచి రూ. 436కు చేరింది. అలాగే సురక్ష బీమా యోజన ప్రీమియం రూ. 12 నుంచి 20కు పెరిగింది. బంగారం కొనుగోలు చేసే వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఈరోజు నుంచి జువెలరీ సంస్థలు కేవలం హాల్ మార్కింగ్ ఉన్న బంగారు నగలనే విక్రయించాల్సి ఉంటుంది. అందువల్ల మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఈ విషయాన్ని గుర్తించుకోండి. హాల్ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
వాహన కొనుగోలుదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఎందుకంటే ఈరోజు నుంచి థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల కారు, టూవీలర్ కొనే వారు జేబు నుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ చార్జీలను పెంచేసింది. సర్వీస్ చార్జీలు పెంచుతున్నట్లు బ్యాంక్ ఇప్పటికే తెలియజేసింది. ఈరోజు నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. అంతేకాకుండా బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్‌ను కూడా పెంచింది. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఈ బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.
జీఎస్‌టీ చెల్లింపుదారులకు ఊరట. జీఎస్‌టీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం అయినా కూడా చార్జీలు చెల్లించుకోవాల్సిన పనిలేదు. జూన్ వరకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. మే 1 నుంచి జూన్ 30 వరకు చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరం జీఎస్‌టీఆర్ 4 దాఖలకు ఇది వర్తిస్తుంది. పీఎఫ్ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం కంపెనీలు వాటి ఉద్యోగుల ఆధార్ కార్డులను కచ్చితంగా పీఎఫ్ అకౌంట్లతో లింక్ చేయాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఎందుకంటే బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచేసింది. ఇప్పుడు వడ్డీ రేటు 7.05 శాతానికి చేరింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు రుణాలకు ఇది వర్తిస్తుంది. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ. 135 మేర తగ్గించేశాయి. ధర తగ్గింపు నిర్ణయం నేటి నుంచే అమలులోకి వచ్చింది. 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం నిలకడగానే ఉంది. విమాన ప్రయాణం భారం కానుంది. కేంద్ర ప్రభుత్వం విమాన టికెట్ ధరల కనీస పరిమితిని 16 శాతం వరకు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. జూన్ 1 నుంచే ఈ పెంపు అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్ పేమెంట్లకు సంబంధించి రూల్స్‌ను మార్చేసింది. పాజిటివ్ పే కన్ఫర్మేషన్ రూల్‌ను అమలులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. దీనివల్ల మోసాలను అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది.