ఏ సందర్భం వచ్చిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీల మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా బెంగాల్ లో సింగ్ కేకే మరణం వివాదం చుట్టూ రాజకీయం సాగుతోంది. ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ మృతిపై అనేక అనుమానాలు రాజుకున్నాయి. ఇప్పటికే పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. కేకే మరణం గురించి అతని అభిమానులు అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఫల్యం వల్లే కేకే చనిపోయారని బీజేపీ ఆరోపణలు చేసింది. ఆయన మరణాన్ని రాజకీయం చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
మరోవైపు అభిమానులు సైతం కేకే మరణం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. వేదిక దగ్గర సరైన ఎయిర్ కండిషనింగ్ లేదని, కేకే చాలా అసౌకర్యానికి గురయ్యారని అభిమానులు అంటున్నారు. "నజ్రుల్ మంచాలలో ఏసీ పని చేయడం లేదు. అతను అక్కడ ప్రదర్శన ఇచ్చారు. అతనికి చాలా చెమటలు పట్టడం వల్ల ఫిర్యాదు చేశారు. అది ఓపెన్ ఆడిటోరియం కాదు. దీన్ని నిశితంగా చూడండి. అతను చెమటలు కక్కుతున్న తీరును.మూసి ఉన్న ఆడిటోరియం, కిక్కిరిసిన తీరుని. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ లెజెండ్ చనిపోయారు." అని ఒక అభిమాని ట్వీట్ చేశారు.
అలాగే ఆడిటోరియంలో సింగర్ కేకే ఏసీలు పెట్టమని, లేజర్ లైట్లను డిమ్ చేయమని కోరారని మరొక అభిమాని అన్నారు. ఇంత దారుణం మీరు ఈవెంట్‌ను ఎలా నిర్వహిస్తారని, ఈ నష్టానికి తృణమూల్ కాంగ్రెస్ జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా దారుణ మేనేజ్‌మెంట్ ఈవెంట్ అని అని కూడా విమర్శించారు.
ఇదిలావుంటే ఆడిటోరియంలో సామర్థ్యానికి మించి జనాలు గుమిగూడినట్టు తెలుస్తుంది. రెట్టింపు సంఖ్యలో జనం వచ్చారు. అక్కడి ఆడిటోరియం నిర్వహణకు సంబంధించిన లోపాలు చాలానే బయటపడ్డాయి. గుండెపోటుకు గురవ్వడానికి ముందు కేకే చాలా అసౌకర్యానికి గురయ్యారు. అభిమానులు ట్వీట్ చేసిన వీడియోల్లో అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన బాగా ఉక్కపోతకు గురయ్యారు. గాలి సరిగ్గా వీయకపోవడంతో చాలా ఇబ్బందిపడ్డారు. ఆడిటోరియంలో వసతలు లేమి, నిర్వాహణ లోపాలే కేంద్ర బిందువుగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల రాజకీయ వివాదం చోటుచేసుకుంది.
కేకే మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రముఖులకు తగిన రక్షణ కల్పించడంలో విఫలమైందని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. సెలబ్రిటీలకు రక్షణ, భద్రత కల్పించడం యంత్రాంగ బాధ్యత అని, ఏసీలు ఆగిపోవడం వల్ల, విపరీతమైన వేడి వల్లే సింగర్ కేకే తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు.