వైసీపీ పాలన ఎలా ఉందో ప్రజలకే బాగా తెలుసని జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం గడపగడపకు వెళ్తుంటే ఎటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయో అందరికీ తెలుసన్నారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. బుధవారం శ్రీకాకుళంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నాగబాబు సమీక్ష నిర్వహించారు.. పార్టీ బలోపేతంపై చర్చించి, వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నాగబాబు స్పందించారు. పొత్తులపై తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు మెగా బ్రదర్ తెలిపారు. త్వరలో అన్ని నియోజవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తామని.. ఉత్తరాంధ్రలో జనసైనికుల్లో జోష్ నింపేందుకు తాను వచ్చానన్నారు. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నాని.. నియోజకవర్గాలవారీ పార్టీ శ్రేణులతో చర్చించిన అంశాలను మా పీఏసీ దృష్టికి తీసుకువెళతాను అన్నారు.
జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలంగా ఉందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బలంగా బరిలోకి దిగేందుకు జనసైనికులు సిద్దంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని.. శ్రీకాకుళం జిల్లా ఇచ్భాపురం, పలాస, టెక్కలి, పాత పట్నం, నర్సన్న పేట, ఆముదాలవలస, శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో మాట్లాడానన్నారు. జన సైనికులలో ఎక్కువ శాతం మేధావులు, విద్యావంతులు, ఐ.టీ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. వారందరి ఆలోచన విధానం, మేధస్సు, పార్టీ గెలుపు కోసం వారు చేస్తున్న కృషి అమూల్యమైనది అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే జనసేన పార్టీ ప్రధాన విధానమని.. ఆ కోవలోనే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా జనసైనికులు పని చేస్తున్నారన్నారు.
మరోవైపు జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 4న మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పవన్‌తో పాటూ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పొలిట్ బ్యూరో సభ్యులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల ఛైర్మన్లు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, వీరమహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సుమారు 4 గంటల పాటు కొనసాగనుంది.
ఈ సమావేవం ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై లోతుగా చర్చిస్తారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలను ఆమోదిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీ పవన్ కళ్యాణ్ 3న సాయంత్రానికి మంగళగిరి చేరుకోనున్నారు.