మనం మొన్నటి వరకు బైక్, కారు, ఆటో, లారీ, బస్సు ఇలా ప్రతి వాహనం వెనక మంచి సూక్తులను చూసివుంటే. అమ్మదీవేన ఇలాంటి వ్యాఖ్యలు చూసేవుటాం. కానీ తాజాగా ఓ వింత వ్యాఖ్యలు ఇతర అనేక వ్యాఖ్యలకు దారితీశాయి. దీనికి సోషల్ మీడియా వేదికైంది. డబ్బులు ఊరికే రావు.. లలితా జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ చెప్పే ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్‌లో ఓ బైకర్ ఈ డైలాగ్‌ను కాస్త మార్చి, ‘కష్టాలు ఎవరికీ ఊరికనే రావు.. పెళ్లి చేసుకుంటేనే వస్తాయి’ అంటూ తన బైక్ వెనుకాల రాసుకున్నాడు. బైక్ నంబర్ ప్లేట్ కింద ఓ పలక కట్టి ఈ మాటలు రాసిపెట్టాడు. ఆ మాటలు చూసి వాహనదారులు నవ్వుకుంటున్నారు. భూమా శరణ్ అనే నెటిజన్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ‘దీనిపై మీ కామెంట్ ఏంటి?’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశారు. దీనికి బదులిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్ ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చింది.
‘కష్టాలు ఎవరికీ ఊరికే రావు.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతేనే వస్తాయి’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బదులిచ్చారు. సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ఫొటోను, హెల్మెట్‌ను బైక్ వెనకాల తగిలించి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, పాటలు వింటూ తాపీగా వెళ్తున్న మరో బైకర్ ఫోటోను జత చేశారు. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కష్టాలు తప్పవంటూ సూటిగా హెచ్చరించారు.
సినిమా క్లిప్పింగులు, పాపులర్ డైలాగ్‌లను కాస్త మార్చి, ట్రాఫిక్ నిబంధనలకు లింక్ చేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసే ట్వీట్లు, ప్రచారానికి మంచి ఆదరణ ఉంటుంది. ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ.. పొరపాట్ల వల్ల జరిగే నష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటారు. వీటి ద్వారా వాహనదారుల్లో అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు చేసిన తాజా ట్వీట్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..!