దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీలలో గుంటూరు-విజయవాడ నగరాల మధ్యలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో ఎంపీ విజయసాయిరెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ కు పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ సందర్భంగా పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నామని తెలియచేశారు.
పార్టీ నేతలు, కార్యకర్తలకు, అతిథులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూలై 8వ తేదీన ప్రారంభమై 9 వతేదీ సాయంత్రం వరకు ప్లీనరీ కొనసాగుతుందని, పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేవిధంగా అందరూ సమష్టిగా పనిచేయాలనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధాన ఉధ్దేశ్యం అన్నారు. పార్టీ నేతలకు సంబంధించి ఎక్కడైనా చిన్నపాటి విభేదాలున్నప్పటికి వాటిని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకు నడవాలన్నారు. వైయస్ఆర్ సీపీలో వర్గాలకు తావులేదన్నారు. అలాంటివి ఎవరి మధ్యన ఉన్నా వాటిని ప్రోత్సహించే పరిస్దితి ఉండదని స్పష్టం చేశారు. ఇది పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు.