అమెరికాలో మళ్లీ కాల్పుల మోతమోగింది. ఓక్లాహామా రాష్ట్రంలోని తుల్సాలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రి క్యాంపస్ భవనంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతిచెందగా, మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారంరోజుల క్రితం టెక్సాస్ పాఠశాలలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 21మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఈ ఘటన మరువక ముందే మళ్లీ కాల్పుల ఘటన చోటు చేసుకోవటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండటం అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. గతనెల 14న న్యూయార్క్‌లోని బఫెలో లోని ఒక కిరాణా దుకాణంలో ఆఫ్రికన్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10మంది చనిపోయారు. వారం రోజుల క్రితం టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక పాఠశాలలో AR-15తో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19మంది చిన్నారులతో సహా 21 మంది మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతిచెందింది. తాజాగా గురువారం ఓ గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు.