టీమిండియా పేసర్, టెస్టులలో రెగ్యులర్ బౌలర్ గా మారిన మహ్మద్ సిరాజ్ 2021 లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అదరగొట్టాడు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న తన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. కాగా ఆ సిరీస్ కు సంబంధించిన విశేషాలతో కూడిన తెరకెక్కుతున్న ‘బందోన్ మే థా ధమ్’ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సిరాజ్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో అది అత్యంత కఠినమైన సమయం. ఐపీఎల్ టైం (2021) లోనే నాన్నకు సీరియస్ గా ఉంది. అయితే ఆ విషయం నాకు తెలియనీయలేదు. నేను ఆస్ట్రేలియాకు వెళ్లాక ఆ విషయం తెలిసింది. ఇక నేను ఆసీస్ కు చేరుకున్న కొద్దిరోజులకే నాన్న చనిపోయారన్న వార్త వినాల్సి వచ్చింది. అప్పుడు ఇటు (ఇండియాకు) తిరగొద్దామంటే ఆస్ట్రేలియాలో కఠిన కొవిడ్-19 నిబంధనల వల్ల రాలేకపోయా.
అప్పుడు రూమ్ లో ఒక్కన్నే కుమిలి కుమిలి ఏడ్చేవాన్ని. అయితే ఆ సమయంలో మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నీ తండ్రి కలను నిజం చెయ్.. నీ దేశం కోసం ఆడు.. అని నాలో స్ఫూర్తి నింపింది. ఆ రెండు మాటలు నాకు టానిక్ లా పనిచేశాయి. నేను తుది జట్టులో ఉంటానో లేదో నాకు తెలియదు. కానీ నా వంతుగా నెట్స్ లో తీవ్రంగా కృషి చేశా…చివరికి నాకు రెండో టెస్టులో ఆడే అవకాశమొచ్చింది. మెల్బోర్న్ టెస్టులో నేను టీమిండియా క్యాప్ ధరించిన మొదటి క్షణం.. ఇక్కడ మా నాన్న ఉంటే బాగుండేదని అనిపించింది..’ అని ఎమోషనల్ అయ్యాడు సిరాజ్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో దారుణంగా ఓడిన టీమిండియా మెల్బోర్న్ లో మాత్రం పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది. ఈ టెస్టుకు ముందు మహ్మద్ షమీ గాయపడటంతో సిరాజ్ కు ఆడే అవకాశం దక్కింది. ఈ సిరీస్ గెలవడంతో సిరాజ్ పాత్ర కూడా తక్కువ చేయలేనిదే. మూడు టెస్టులలో సిరాజ్.. మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే.