ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై పట్టు బిగించింది. సువేద్ పార్కర్ (252) తన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ బాదాడు. గాయం కారణంగా దూరమైన అజింక్యా రహానే స్థానంలో సువేద్ పార్కర్ జట్టులోకి వచ్చాడు. అతనికి తోడుగా సర్ఫరాజ్ ఖాన్ (153) భారీ సెంచరీతో రాణించడంతో ముంబై తన తొలి ఇన్నింగ్స్‌ను 647/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 39/2తో రెండో రోజు ఆట ముగిసింది. కమల్ సింగ్ (27), కునాల్ చండేలా (8) క్రీజులో ఉన్నారు.
ఓవర్ నైట్ స్కోరు 304/3తో రెండో రోజైన మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబైకి సువీద్, సర్ఫరాజ్ సారథ్యం వహించారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 267 పరుగులు జోడించి ముంబైకి భారీ ఆధిక్యాన్ని అందించింది. ఈ క్రమంలోనే రంజీ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన పన్నెండవ ఆటగాడిగా సువేద్ నిలిచాడు. అతడితో పాటు సర్ఫరాజ్ కూడా దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరితో పాటు ఇన్నింగ్స్ చివర్లో సామ్స్ ములానీ (59) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై భారీ స్కోరు సాధించింది.