పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు చెప్పేవారు కూడా లేకుండా దానిని మూసివేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాడిపత్రి మండల పరిధిలోని భోగసముద్రం స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
ఈ పరిశ్రమలో ఓ బాయిలర్ పేలి పలువురు కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రానివ్వకుండా అటు పరిశ్రమ యాజమాన్యం, ఇటు అధికారులు పోలీసులు చాలా గోప్యత ప్రదర్శించారు. ప్రమాదం జరిగిందని బుధవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా దీనిపై ఎవరూ కూడా నోరు మొదపకపోవడం గమనార్హం.
భోగసముద్రం స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో కార్మికులు పని చేస్తున్న సమయంలో పెద్ద శబ్ధంతో బాయిలర్ పేలినట్లు తెలుస్తోంది. భారీగా వచ్చిన శబ్ధాన్ని అక్కడి కార్మికుల కుటుంబాలు, సమీపంలోని నివాసాల వారు విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో కొందరు కార్మికులు గాయపడినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని బయటకు రానీయకుండా పరిశ్రమ యాజమాన్యం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయం పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి తెలిసినా వారు కూడా ప్రమాదం జరగలేదు అన్నట్లుగా విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. అధికారులు హడావుడిగా పరిశ్రమలోకి వెళ్లడం. యాజమాన్యంతో మాట్లాడడం, తరువాత అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు అన్నట్లు సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరింత మంది గాయపడ్డరా.? లేక ఇంకా ఏమైనా జరిగిందా.? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై రెవెన్యూ, పోలీసు అధికారులను విలేకరులు వివరణ కోరినా సమాచారం ఇచ్చే వారు కరువయ్యారు. కనీసం మీడియా సిబ్బందిని పరిశ్రమలోకి కూడా అనుమతించలేదు. పరిశ్రమ జిఎం మహబూబ్ అలీకి ఫోన్ చేయగా ఆయన కూడా ఎవరి ఫోన్‌కు సమాధానం ఇవ్వలేదు.
ప్రమాదం జరగకుంటే సరైన ఆధారాలతో దానిని బయటకు చెప్పేందుకు అభ్యంతరాలు ఏమి ఉంటాయన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ముడి ఐరన్ తయారీ చేయడంలో భాగంగా పలురకాల ముడి ఖనిజాలు స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో ఉన్న నీటితో నిండిన బాయిలర్‌లో వేస్తారు. వీటికి కొన్ని రసాయనాలను కలుపుతారు. ఇలా బాయిలర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత మధ్య వేడి చేయడం ద్వారా ఐరన్ ముద్దలు తయారై బయటకు వస్తాయి. ఇలా తయారు చేస్తున్న సమయంలోనే ఓ బాయిలర్ పేలి ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
బాయిలర్ లో ఎక్కువ మోతాదులో ఖనిజాలను వేయడం వల్ల అందులో జరిగే వివిధ రసాయనిక ప్రక్రియలో ఒత్తిడికి బాయిలర్ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేసే నలుగురు కార్మికుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై పరిశ్రమ బయట విలేకరులతో మాట్లాడిన ఇన్‌ఛార్జి తహశీల్దార్ రాజారామ్ పొంతన లేని మాటలతో సమాధానం చెప్పడం గమనార్హం.
పరిశ్రమలోకి ఎవరైనా కార్మికులు వెళ్లాలంటే సేఫ్టీ వస్త్రాలను ధరించాలి. వీటిని యాజమాన్యమే కార్మికులకు అందజేయాలి. ప్రస్తుతం ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వస్తున్న పరిశ్రమలో ఇలాంటి సేఫ్టీ నిబంధనలు ఏవీ అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. సాధారణ పనుల వలే కార్మికులతో ప్రమాదకర ప్రాంతాల్లో పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఉదాహరనే బుధవారం ఉదయం స్పాంజ్ ఫ్యాక్టరీలో జరిగిన బాయిలర్ పేలుడు ప్రమాదం.