ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరివేపాకుతో ఆ సమస్యలకు చెక్ పెట్టండి

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 12:19 PM

క‌రివేపాకు కేవ‌లం రుచి, వాస‌న‌కే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. క‌రివేపాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


క‌రివేపాకులో ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఫోలికామ్లం, నియాసిన్‌, బీటా కెరోటిన్‌, ఇనుము, కాల్షియం, పీచు, మాంస‌కృత్తులు, కార్బొహ్రైడేట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి. జీర్ణ‌క్రియ స‌జావుగా సాగేందుకు, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించేందుకు పీచు స‌హ‌క‌రిస్తుంది. కొద్దిగా క‌రివేపాకు మిశ్ర‌మాన్ని గ్లాసులో మ‌జ్జిగలో చిటికెడు ఇంగువ‌, క‌రివేపాకు, కాస్త సొంపు క‌లిపి తాగితే అజీర్తి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. క‌రివేపాకులో విట‌మిన్ ఏ ల‌భిస్తుంది. ఇది కంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. ప్ర‌తిరోజూ తినే ఆహారంలో క‌రివేపాకు వేయ‌డం వ‌ల్ల వ‌య‌సు పెరిగే కొద్దీ వ‌చ్చే క్యాట‌రాక్ట్ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.


కరివేపాకును తింటే ర‌క్తంలోని చ‌క్కెర‌స్థాయులు అదుపులో ఉంటాయి. కరివేపాకులోని యాంటీ హైప‌ర్ గ్లెసెమిక్.. ర‌క్త‌నాళాల్లోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. త‌ద్వారా మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది. రోజూ ఆహారంలో క‌రివేపాకును తిన‌డం వ‌ల్ల బ‌రువు తగ్గించుకోవచ్చు. రోజూ నాలుగు ప‌చ్చి క‌రివేపాకు ఆకుల్ని న‌మ‌ల‌డం వ‌ల్ల కొవ్వుస్థాయులు త‌గ్గుతాయి. క‌రివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యూరిన్‌, బ్లాడ‌ర్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. క‌రివేపాకు రసంలో కొంచెం దాల్చిన చెక్క పొడి క‌లుపుకుని తాగ‌డం ద్వారా మూత్ర సంబంధిత స‌మ‌స్య‌ల‌ను నివారించ‌వ‌చ్చు. కిడ్నీ స‌మ‌స్య‌ల‌ను కూడా క‌రివేపాకు దూరం చేస్తుంది.


వేపాకు, క‌రివేపాకును స‌మ‌పాళ్ల‌లో తీసుకుని ఒక ముద్ద చేసుకుని రోజూ అర‌క‌ప్పు మ‌జ్జిగ‌తో తీసుకుంటే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి. క‌రివేపాకులో ఐర‌న్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. రోజూ క‌రివేపాకును ఆహారంలో తీసుకోవ‌డం ద్వారా ర‌క్తంలో ఐర‌న్ పెరుగుతుంది. క‌రివేపాకులోని ఫోలికామ్లం ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది.


కొబ్బ‌రి నూనెలో క‌రివేపాకు వేసి వేడి చేయాలి. దీన్ని చ‌ల్లార్చి త‌ల‌కు ప‌ట్టించి మ‌ర్ద‌న చేయాలి. 20 నిమిషాల త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల జుట్టు ఊడే స‌మ‌స్య త‌గ్గుతుంది. తెల్ల జుట్టు స‌మ‌స్య‌కు కూడా క‌రివేపాకుతో చెక్ పెట్టవచ్చు. కొంచెం కొబ్బ‌రి నూనెలో మెంతికూర‌, వేపాకు, క‌రివేపాకు వేసి చిన్న మంట‌పై వేడిచేయాలి. దీన్ని చ‌ల్లార్చి ప‌డుకునే ముందు త‌ల‌కు ప‌ట్టించాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల జుట్టు నెర‌వ‌కుండా న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com