కంబదూరు మండలంలో చాలామంది రైతులు పశువులు, గొర్రెలు, మేకలను పోషించుకుని జీవనోపాధిని పొందుతున్నారు. అవి మేత కోసం అడవికి వెళ్ళితే వేసవికాలంలో మూగ జీవాలకు తాగు నీరు దొరకడం లేదు. వర్షాకాలంలో అయితే కుంటలు, కాలువల్లో నీరు నిలిచి వుంటాయి. ఈ సీజన్ లో అడవిలో నీరు అందుబాటులో లేక కోతులు పూర్తిగా జనవాసాల్లోకి వచ్చేశాయి. అపుడపుడు పిలవని చుట్టం లాగా ఎలుగుబంట్లు, చిరుతలు గ్రామాల్లోకి వస్తున్నాయి. అలాంటి సమయాలలో జనం భయంతో వణికి పోతున్నారు. ఈ పరిస్థితి ఎదురు కాకుండా అడవిప్రాంతాలలో అక్కడ అక్కడ నీటి తొట్టెలు ఏర్పాటు చేసి టాంక్ ల ద్వారా నీటిని నింపడం చేయాలని, లేదా అక్కడే బోరువేసి నీటిని తొట్లలోకి పంపింగ్ చేసి వేసవిలో నీరు నిల్వ ఉండేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణం చర్యలు చేపట్టి మూగ జీవుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.