ప్రభుత్వం నిషేధించిన జూదం, బెల్టుషాపుల నిర్వహణకు రామతీర్థం గ్రామంలో అనాధికారికంగా వేలం పాటలు నిర్వహించిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. కొద్ది నెలలుగా గ్రామంలోని తీరప్రాంతంలో పేకాట గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. అయితే అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టక పోవటంతో పాటు పేకాట నిర్వాహకులకు లక్షల్లో లాభాలు రావటంతో అక్రమార్కులు బరితెగించారు.
మూడురోజుల క్రితం గ్రామంలో వేలం పాటలను నిర్వహించారు. బహిరంగంగా జరిగిన వేలం పాటల్లో పేకాట రూ. 4. 50 లక్షలు, బెల్టు షాపు నిర్వహణకు రూ. 2లక్షలకు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేలం పాట పాడుకున్నవారు తప్ప ఇంకేవ్వరూ జూదం, మద్యం అమ్మకాలు చేయ్యకూడని షరతులు విధించారు.