ఆత్మకూరు వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారానికి రాగా.. కొన్ని చోట్ల గ్రూపు రాజకీయాలు చూసి షాకయ్యారు.అందరూ మేకపాటి కుటుంబానికి నమ్మకంగానే ఉంటున్నా.. లోకల్ పాలిటిక్స్ విషయానికొచ్చే సరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల పరిధిలోని చౌట భీమవరం గ్రామంలో రెండు వర్గాలు ప్రచారంలోనే గొడవపడ్డారు.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థి ఇక్కడ సర్పంచిగా గెలిచారు. ఆ తర్వాత అతను వైసీపీలో చేరారు. వైసీపీ బలపరచిన అభ్యర్థి ఆ ఎన్నికల్లో ఓడిపోగా.. అతను కూడా పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారిద్దరూ వైసీపీలో రెండు గ్రూపులుగా ఉన్నారు. విక్రమ్ రెడ్డి ప్రచారానికి రావడంతో సర్పంచ్ గా ఉన్న వ్యక్తి వాహనం పైకి ఎక్కేందుకు సిద్ధపడ్డారు. దీంతో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారి వర్గం అడ్డుకుంది. పక్క పార్టీనుంచి వచ్చి నీ పెత్తనం ఏంటని నిలదీశారు. మీరంతా బీజేపీ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల ముందు నాటకాలాడేందుకు.. వాహనం ఎక్కుతున్నారంటూ వారిని పక్కకు లాగేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ప్రచారం అక్కడ హడావిడిగా ముగిసింది.
ఇరువర్గాలు ఒకరినొకరు నెట్టుకొని కొట్లాటకు దిగడంతో అక్కడే ఉన్న పోలీసులు అందర్నీ చెదరగొట్టి తరిమివేశారు. దీంతో ప్రచారాన్ని ముగించుకొని వైకాపా అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఆక్కడి నుండి వెళ్ళిపోయారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామంలో 144 సెక్షన్ విధించి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా రిజర్వ్ బలగాలను రప్పించారు. వారితో చౌట భీమవరంలో పహారా కాస్తున్నారు అధికారులు. గ్రామంలో 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు.
చౌట భీమవరం చిన్న గ్రామం, అక్కడ గొడవ కూడా చిన్నదే, కానీ ఇప్పుడది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం ఉప ఎన్నికల సమయంలో అయినా ఇరు వర్గాలు సఖ్యతతో లేకపోవడంతో అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. పార్టీ తరపున దాదాపు 10మంది మంత్రులు, 15మంది ఎమ్మెల్యేలు.. ప్రచారానికి వచ్చారు. ఇంతమంది అగ్రనాయకులు వచ్చినా కూడా ఇంకా లోకల్ గొడవలు ఏంటని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవను టీడీపీ అనుకూల మీడియా మరింత హైలైట్ చేస్తోంది. అటు బీజేపీ కూడా వైసీపీలో వర్గపోరు ఉందని విమర్శలు చేస్తోంది. ఈ దశలో వైసీపీకి ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఈ గొడవని కవర్ చేయాలనుకున్నా.. పోలీసులు రంగప్రవేశం చేయడంతో బహిర్గతమైంది. ప్రస్తుతం సీనియర్ నాయకులు చౌటభీమవరం నాయకులతో మాట్లాడుతున్నారు. సర్దుకుపోవాలని చెబుతున్నారు.