విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో కొందరు నిబంధనల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీద కేసు కూడా బుక్ అయింది. ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ కొనాలనుకొంటే దానికి సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోండని ప్రభుత్వం చెబుతోంది. అలాగే బిల్డర్లు లైసెన్స్ ఉన్నవారా కాదా? అనేది కూడా చూసుకోవాలని సూచిస్తోంది. ఎందుకంటే లైసెన్స్ ఉన్న బిల్డర్ అయితే అపార్ట్‌మెంట్ నాణ్యత బాగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. లైసెన్సు లేకుండా అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు అనుమతి లేదని, అందుకే డాక్యుమెంట్లు సరిచూసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. లైసెన్సు లేకుండా అపార్ట్‌మెంట్ నిర్మిస్తే మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేయాలని అంటోంది. కానీ అలాంటి బిల్డర్లకు లైసెన్సుల మంజూరులోనే నిబంధనలు పాటించడం లేదని, మున్సిపల్ అధికారులే చట్ట విరుద్ధంగా అనుమతులు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించి బిల్డర్ లైసెన్సులు మంజూరు చేశారంటూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పటికే మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలో ప్రణాళికా విభాగం తీరు మీద విమర్శలు వస్తున్నాయి. వాటికి తోడుగా లైసెన్సుల మంజూరులోనే ఇలా వ్యవహరిస్తే ఇక అలాంటి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. పట్టణాలు, నగరాల పరిధిలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం బిల్డర్లకు లైసెన్సుల మంజూరు చేసే అధికారం కమిషనర్లకు ఉంటుంది. జీవో నెం. 119 ప్రకారం నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం, నిర్మాణదారులకు మోడల్ రూల్స్ అనుసరించి అనుమతులు మంజూరు చేయాలి. బిల్డర్ క్వాలిఫైడ్ సివిల్ ఇంజినీర్ అయి ఉండాలి లేదా ఆర్కిటెక్ట్ అర్హత ఉండాలి. ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ ఐదేళ్ల పాటు గ్రేడ్-2 కాంట్రాక్టర్‌గా నిర్మాణ రంగంలో ఉన్న వారు కూడా బిల్డర్ లైసెన్స్ పొందేందుకు అర్హులు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్-2017 ప్రకారం నిబంధనలు పాటించని వారికి బిల్డర్ లైసెన్స్ మంజూరు చేయకూడదు. ఐదేళ్ల ఆదాయపు పన్ను చెల్లింపు పత్రాలు సహా అన్ని అర్హత పత్రాలు సమర్పించిన తర్వాత, వాటిని పరిశీలించి మాత్రమే లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు తొలుత తాత్కాలిక ప్రాతిపదికన, ఆ తర్వాత దానిని కొంత కాల పరిమితితో లైసెన్సులు జారీ చేస్తారు. ఆ సమయంలోనే బిల్డర్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్హత పత్రాలకు తగిన ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. వాటిని మున్సిపల్ అధికారులు సమగ్రంగా పరిశీలించ, కమిషనర్ ఆమోదంతో లైసెన్స్ అందిస్తారు. బిల్డర్‌కు లైసెన్స్ మంజూరులో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు పదే పదే వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బిల్డర్ లైసెన్సుల మంజూరులో నిబంధనలు పాటించకుండా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జీవోను ఉల్లంఘించారటూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు అందింది.